ఈసారి ఆ రుచులను ఆస్వాదించలేం!

by  |
ఈసారి ఆ రుచులను ఆస్వాదించలేం!
X

దిశ, కరీంనగర్:
రంజాన్ మాసంలో తెలంగాణ స్పెషాలిటీ వంటకాలు ఈసారి అందుబాటులో ఉండవు. రంజాన్ నెల వచ్చిందంటే చాలు ముస్లింలే కాకుండా హిందువులు కూడా ఇష్టపడి తినే ఆ రుచులను ఆస్వాదించలేకుండా చేసింది నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి. ఈ వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో జనమంతా ఇళ్లకే పరిమితం అయింది. హోటళ్లు కూడా మూసివేయాల్సి రావడంతో రంజాన్ స్పెషల్ కోసం ఏర్పాటు చేసే స్టాళ్లు ప్రారంభం కావన్నది స్పష్టం. దీంతో ఈసారి రంజాన్ స్పెషల్ రుచులను ఆస్వాదించకలేకపోతున్నామని పలువురు భోజనప్రియులు అనుకుంటున్నారు. తెల్లవారుజామునే గోధుమలను నానబెట్టి గంటల తరబడి బట్టిపై ఉడకబెట్టి నిరంతరం కలుపుతూ సాయంత్రానికల్లా సిద్ధం చేసే హర్రీస్, హలీమ్ రంజన్ మాసంలో ప్రత్యేక వంటకాలు. రోజంతా రోజా ఉండి సాయంత్రం ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష విడిచిపెట్టిన తర్వాత ముస్లింలు హర్రీస్, హలీమ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అత్యంత పోషక విలువలతో కూడిన ఈ పదార్థాలను తినడం వల్ల ఎనర్జీ కూడా పుష్టిగా లభిస్తుంది. శతాబ్దాల నుంచి ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షా సమయంలో కచ్చితంగా వీటిని తయారు చేసుకుని ఆహారంగా తీసుకునే విధానం అమలవుతోంది. అనాదిగా వస్తున్న ఈ ఆహారం తయారు చేసుకునే ఆచారం గతంలో ఇళ్లలోనే కొనసాగేది. క్రమ క్రమంగా ఉన్నతవర్గాలే కాకుండా పేదలు కూడా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బలవర్ధకంగా మారే అవకాశం ఉంటుందని స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయించే పద్ధతికి చేరింది. మొదట్లో ఒకటి అర స్టాళ్లతో ప్రారంభం అయిన హర్రీస్, హలీమ్ సెంటర్లు నేడు ఒక్కో చోట వందల సంఖ్యలో ఏర్పాటు అవుతున్నాయి. చివరకు తెలంగాణ రంజాన్ స్పెషల్ వంటకాలు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాయి. హైదరాబాద్ నగరంలో కొన్ని స్టాళ్లయితే ప్రత్యేకంగా విదేశాలకు ఎగుమతి చేసేందుకే హలీమ్ తయారు చేస్తున్నాయి. కేవలం హర్రీస్, హలీమ్ తయారీయే కాకుండా తందూరీ పదార్థాలకు కూడా అడ్డాగా మారిపోయాయి. హిందువులు కూడా చాలా ఇష్టంగా తినే ఈ పదార్థాలకు రానురాను డిమాండ్ పెరిగిపోవడంతో స్టాళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. అలాగే రంజాన్ మాసం ప్రారంభంలో ఆరంభం అయ్యే ఈ స్టాళ్లను కొంతమంది అంతకు ముందే ప్రారంభించి, రంజాన్ ముగిసిన తర్వాత కొద్ది రోజుల పాటు కొనసాగిస్తున్న పరిస్థితి తయారైంది.

40 టన్నుల గోధుమలు..

రంజాన్ మాసంలో ఈ ఆహారానికి డిమాండ్ పెరిగిపోవడంతో ఈ సీజన్‌లో తెలంగాణ వ్యాప్తంగా గోధుమలు 40 టన్నుల వరకు వినియోగిస్తారు. ఇక చికెన్, మటన్ కూడా టన్నుల్లోనే విక్రయాలు సాగగా, ఇటీవల కాలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా డబల్ కా మీఠా, ఖద్దుకా ఖీర్ వంటి స్వీట్లు, బిర్యానీలు కూడా విక్రయిస్తున్నారు. ఇందులో హండీ బిర్యానీ, లెగ్ పీస్‌లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. గత పదేళ్లలో రంజాన్ స్పెషల్ స్టాళ్లలో టన్నుల కొద్ది బిర్యానీ తయారవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ మాసంలో స్పెషల్ ఫుడ్ కారణంగా కోట్లాది రూపాయలు టర్నోవర్ అయ్యేవి. కాని కరోనా కారణంగా ఈ స్టాళ్లకు మోక్షం కలిగే అవకాశం లేకపోవడంతో రంజాన్ స్పెషల్ డిషెస్ ఈ సారి అందుబాటులో ఉండవు. రంజాన్ మాసంలో జిల్లాల్లో ఏర్పాటు చేసే స్పెషల్ వంటకాల స్టాళ్లలో 10 నుంచి 15 మంది ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. వారికి ఇప్పుడు ఉపాధి కరువే.

డోర్ డెలివరీ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో రంజాన్ స్పెషల్ స్టాళ్లు జిల్లాల్లో కంటే రెట్టింపు ఆదాయం గడించేవి. కార్పొరేట్ కంపెనీలు కొన్ని ఆన్‌లైన్ ఆర్డర్లకు కూడా స్వీకారం చుట్టాయి. హైదరాబాద్ నగరంలో పేరున్న హోటళ్లు కూడా హలీమ్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్లతో పాటు ఆన్ లైన్ ఆర్డర్లు తీసుకుని డోర్ డెలివరీ చేసే విధానాన్ని కూడా ఆరంభించాయి కొన్ని హోటళ్లు. రంజాన్ మాసంలో ఎక్కడ చూసిన స్పెషల్ స్టాళ్లే దర్శనం ఇస్తాయి. జిల్లా కేంద్రాల్లో 200 నుంచి 300 వరకు ప్రత్యేకమైన స్టాళ్లు రంజాన్ కోసమే ఏర్పాటు అవుతుండగా హైదరాబాద్, వరంగల్ మహా నగరంలో వేల సంఖ్యలో ఏర్పాటవుతాయి. మొత్తంగా వేలాది మంది రంజాన్ నెలలో ప్రత్యేక వంటకాల కోసం ఏర్పాటు చేసే స్టాళ్ల ద్వారా వేలాది మంది పేదలు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంటుంది. చెఫ్‌లుగా, సర్వర్లుగా, డెలివరీ బాయ్‌లుగా ఇలా పలురకాలుగా ఎంప్లాయి‌మెంట్ పొందేవారికి ఈ ఏడాది నో ఛాన్స్ అని చెక్ పెట్టేసింది మహమ్మారి కరోనా.

డ్రై ఫ్రూట్స్ సెంటర్స్ కూడా…

రంజాన్ అంటే విభిన్న రుచుల మేళవింపుతో తయారు చేసే వంటకలే కాకుండా డ్రై ఫ్రూట్స్ విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. పచ్చి, ఎండు ఖర్జూర, అంజీర్, ఖాజు, కిస్మిస్, బాదం, పిస్తాతో పాటు పలురకాల డ్రై ఫ్రూట్స్, మసాలాలను విక్రయించేందుకు ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు అయ్యేవి. రంజాన్ నెల కోసమే చిరు వ్యాపారులు ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి విక్రయించేవారు. ఈ రకమైన స్టాళ్లు వందల సంఖ్యలో ఏర్పాటు అయ్యేవి. డ్రై ప్రూట్ సెంటర్ల ఒక్కో జిల్లాలో వందల సంఖ్యలో ఏర్పాటు అయ్యేవి. ఈ సారి ఓపెన్ మార్కెట్ ఉండే అవకాశం లేనందున నిత్యవసరాల కొనుగోలు కోసం కేటాయించిన సమయంలోనే వీటి అమ్మకాలు జరపుకోవల్సి ఉంటున్నందున డ్రై ప్రూట్స్ సెంటర్ల ఏర్పాటు కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఈ ప్రూట్స్ పేరిట జరిగే వ్యాపారం కోటి రూపాయల పైనే ఉంటుందని ఓ అంచనా. సాధారణ పండ్ల క్రయవిక్రయాలపై కూడా కరోనా ప్రభావం చూపనుంది. ఉపవాసం విడిచే ఇఫ్తార్ సమయంలో ముందుగా ఖర్జూరాతో పాటు అరటి వంటి పండ్లను ఆరగిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష విడిచిపెట్టే సమయానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. రోజా ముగిసిన తర్వాత ఆకలిని పెంచేందుకు అవసరమైన వాటినే ఆరగించే పద్ధతి ఉంటుంది. మసీదులకు వెళ్లి రోజా విడిచే విధానంతో పాటు ఇళ్లలో కూడా ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఈ సమయంలో ముందుగా అరటి, ఖర్జూర తినడానికే ప్రాధాన్యం ఇస్తారు. అలాగే చికెన్, మటన్‌తో పాటు, ఫిష్‌తో తయారు చేసుకునే వంటకాలకు ప్రాధాన్యం ఇస్తారు చాలా మంది. కాని లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో ఇప్పుడు ఫిష్ వ్యాపారం కూడా గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది.

అడ్వాన్స్ జకాత్..

ఇక రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం జకాత్. ఐదు సార్లు విధిగా నమాజు చేయడం, రోజా ఉండటం ఎంత ముఖ్యమో జకాత్‌కు కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. గుప్త దానానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే జకాత్ విధానం గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. నిరుపేదలను ఆదుకునేందుకు ఏడాదంతా సంపాదించిన దాంట్లో 2.5 శాతం వరకు దానాల రూపంలో నిరుపేదలను ఆదుకునే విధానం అమలవుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తాము సంపాదించిన ఆదాయంలో విధిగా రంజాన్ నెలలో నిరుపేదలకు గుప్తదానం చేయాలి. ముస్లింలు చాలా మంది అత్యంత సీక్రెట్‌గా అందించే జకాత్ ఈ సారి కరోనా వల్ల అడ్వాన్స్‌గా కొనసాగిస్తున్నారు. ఈ వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నందున రంజాన్ మాసానికన్నా ముందే జకాత్ చేపట్టాలని మత పెద్దలు సూచించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు దానాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది జకాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు కూడా. కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం వల్ల ముస్లింలు అత్యంత వైభవంగా జరుపుకునే రంజాన్ పర్వదినంపై తీవ్రమైన ప్రభావమే పడిందని చెప్పాలి.

Tags: covid 19 affect, lockdown, ramzan, special food items, haleem, stalls, stopped


Next Story

Most Viewed