హనీమూన్‌కు అక్కడికి వెళితే.. విడాకులే!

by  |
హనీమూన్‌కు అక్కడికి వెళితే.. విడాకులే!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా పెళ్లయిన జంటలు.. హనీమూన్ వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. పెళ్లి తర్వాత ఇంట్లో జరిగే సంప్రదాయ వేడుకలు, పనులు ముగిశాక పక్కా ప్లానింగ్‌తో హనీమూన్ సిద్ధమవుతుంటారు. కాగా ఈ స్పెషల్ ట్రిప్‌ను హ్యాపీగా గడిపేందుకు కొన్ని ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాలున్నాయి. అయితే ఆయా హనీమూన్ డెస్టినేషన్స్‌కు వెళ్లినప్పుడు అంతా బాగానే ఉన్నా, అక్కడికి వెళ్లిన జంటలు మాత్రం కలకాలం కలిసి ఉండటం లేదని ఓ సర్వే తేల్చింది. ‘కొత్త జంటలు ఎవరైనా హనీమూన్‌ కోసం ఆ టూరిస్ట్ స్పాట్‌కు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త! మూడు ముళ్ల బంధం మూణ్నా్ళ్ల ముచ్చటై, విడాకులు తీసుకునే అవకాశముంది’ అని ఆ సర్వే చెబుతోంది.

పెళ్లి తర్వాత ఒక్కటయ్యే జంటకు.. ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకునేందుకు, ఇద్దరూ దగ్గరయ్యేందుకు ‘హనీమూన్’ కన్నా బెస్ట్ చాయిస్ లేదు. అయితే ఇరువురు కలిసిపోవడానికి ఆ ప్రదేశాలకు హనీమూన్ వెళితే, విడిపోవడం గ్యారెంటీ అంటోంది ‘కంపేర్.కామ్’. ఈ సంస్థ ఇటీవలే హనీమూన్ తర్వాత విడిపోయిన 3,100 దంపతులపై అధ్యయనం చేసింది. కాగా హనీమూన్ డెస్టినేషన్స్ జాబితాలో భూతల స్వర్గంగా పేరుపొందిన ‘మాల్దీవ్స్’ టాప్ ప్లేస్‌లో ఉంది. అలాంటిది ఇక్కడకు వచ్చిన జంటలు ఎక్కువగా విడిపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. 3100 మందిలో 620 మంది తమ హనీమూన్‌ కోసం మాల్దీవ్స్‌కు వెళ్లగా వారంతా విడాకులు తీసుకున్నారు. ఇటీవలే హీరోయిన్ కాజల్, కిచ్లు జంట సైతం తమ హనీమూన్‌ వెకేషన్‌ కోసం మాల్దీవ్స్ వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఈ సర్వే ప్రకారం చూస్తే.. చందమామ వైవాహిక బంధం సజావుగా సాగుతుందో లేదో చూడాలి.

ఇక మొరాకోలోని మరకెచ్.. న్యూ వెడ్డింగ్ కపుల్స్‌కు ఫేవరెట్ హనీమూన్ డెస్టినేషన్‌గా పేరుగాంచింది. ఎంతోమంది తమ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌తో పాటు హనీమూన్ స్పాట్‌గా మరకెచ్‌ను ఎంచుకుంటారు. అయితే ఇక్కడకు వచ్చిన 527 జంటలు విడాకులు తీసుకున్నట్లు సర్వేలో తేలింది. మరకెచ్ 17శాతం విడాకులతో ఈ లిస్టులో రెండోస్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో బోరాబోరా ఉంది. ఇక్కడికి వచ్చిన 13 శాతం మంది విడాకులు తీసుకున్నారు. టెంపుల్స్, బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్.. బాలి. ఇక్కడకు వచ్చిన వారిలో 10 శాతం మంది విడాకులు తీసుకున్నట్లు సర్వే చెబుతోంది.

ఇక్కడ సేఫ్..

బ్యాంకాక్‌, నాపా వ్యాలీ, మావి, నైరోబీలో హనీమూన్ జరుపుకున్న జంటల్లో మాత్రం అతి తక్కువ మంది విడాకులు తీసుకున్నారు. కాలిఫోర్నియా కూడా సేఫ్ హనీమూన్ డెస్టినేషన్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల 27వేల మంది ‘హనీమూన్ డెస్టినేషన్స్’ కోసం వెతుకుతున్నారని గూగుల్ సెర్చ్ చెబుతోంది.

సర్వేలు, శాస్ర్తాలు, జాతకాలు ఎన్నో చెబుతాయి. కానీ ఏడడుగులు వేసి, మూడుముళ్లతో ఒక్కటైన బంధం.. నూరేళ్లు అన్యోన్యంగా సాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ భేషజాలకు పోకుండా, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అర్థం చేసుకుంటే, అపార్థానికి చోటుండదు. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవిస్తూ ఇద్దరూ కలిసి ఒకే మాటగా, ఒకే బాటలో కలిసి నడిస్తే.. డెస్టినీ, డెస్టినేషన్‌లు కూడా వారిని విడదీయలేవు. విడిపోవడానికి వెయ్యినొక్క కారణాలుండొచ్చు, కానీ కలిసుండాలంటే ఒకరిపై ఒకరికి ప్రేముంటే చాలు.


Next Story

Most Viewed