‘వీకెండ్ లాక్‌డౌన్‘పై ఆలోచించండి

by  |
High Court Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నందున ప్రస్తుతం కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ నిడివిని పెంచడమో లేక ‘వీకెండ్ కర్ఫ్యూ‘ను విధించిడమో చేయడం మంచిదని, దీన్ని ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తున్నందున అప్పటికంటే ముందుగానే దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వివాహాలు, అంత్యక్రియల్లో గుంపులుగా పాల్గొంటున్నందున ఆంక్షలు విధించాలని, దీనిపై 24 గంటల వ్యవధిలో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో పేషెంట్ల నుంచి హెచ్చు మొత్తంలో వసూళ్ళు జరుగుతున్నాయని, నియంత్రణ వ్యవస్థ ఉండాలని, గరిష్ట ధరలను ప్రభుత్వమే ఖరారు చేసి మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించింది. కరోనా పేషెంట్ల కోసం ప్రతీ జిల్లాలో ‘టోల్ ఫ్రీ‘ నెంబర్లను అందుబాటులోకి తేవాలని, రెండు రోజుల్లోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి తరచూ సమావేశాలు నిర్వహించి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.

కరోనా కట్టడిపై బుధవారం జరిగిన విచారణకు డీజీపీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నేరుగా హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణలు, సమర్పించిన గణాంకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్లపై ఇప్పటికీ స్పష్టత లేదని, ప్రజల్లో గందరగోళం ఉందని, జైళ్ళలోని ఖైదీలు, వీధుల్లో నివసిస్తున్న నిరాశ్రయులకు టీకాలను ఏ విధంగా ఇస్తారో తెలియజేయాలని ఆదేశించింది. ప్రతీరోజు కనీసంగా లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని గతంలో ఆదేశించినా అలా జరగడంలేదని నిలదీసింది.

రాష్ట్రంలో ఆక్సిజన్‌కు ఉన్న కొరత, డిమాండ్ తదితరాలపై ఆరా తీసిన హైకోర్టు గణాంకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు నుంచి రావాల్సిన 53 టన్నుల ఆక్సిజన్ రాలేదని ప్రభుత్వం వివరించడంతో వెంటనే సరఫరాను ఇతర చోట్ల నుంచి సమకూర్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రాన్ని 600 టన్నులు కోరితే 430 టన్నులు మాత్రమే వచ్చినట్లు ప్రభుత్వం వివరించింది.

కరోనా కట్టడి కోసం అమలుచేస్తున్న నైట్ కర్ఫ్యూకు సంబంధించి డీజీపీ ఇచ్చిన వివరాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాస్కులు ధరించని వ్యక్తులపై కేసులు నమోదు చేయడం మాత్రమే కాక వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని ఆలోచించాలని సూచించింది. భౌతిక దూరం పాటించని వ్యక్తులపై కేసులు పెట్టడంలేదని, కేవలం సంస్థలపై మాత్రమే నమోదు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. కరోనా నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిందేనని, ఉదాసీనత పనికిరాదని ఆయనకు స్పష్టం చేసింది.

డీజీపీ జోక్యం చేసుకుని మొత్తం 859 పాట్రోలింగ్ వాహనాలు, 1,523 బైక్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆస్పత్రుల దగ్గర పోలీసు హెల్ప్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. బ్లాక్ మార్కెట్‌లో మందులను, ఆక్సిజన్‌ను విక్రయిస్తున్నవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఫంక్షన్ హాళ్ళు, పార్కులు, ప్లే గ్రౌండ్‌లలో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఆదేశించింది.

కరోనా నిర్ధారణ కోసం నిర్వహిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, 24 గంటల్లోనే రిపోర్టులు వచ్చేలా పకడ్బందీ మెకానిజాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం వైరస్ వేరియంట్ ఉనికిలోకి వచ్చిందని, అది తెలంగాణలోకి రాకుండా పక్కా వ్యూహం ఉండాలని, వాహనాల రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండు రోజుల్లోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సమావేశం నిర్వహించి ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.


Next Story

Most Viewed