- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన జీవితమే స్ఫూర్తిగా జీవిస్తున్నారు : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన జీవితమే స్ఫూర్తిగా జీవిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన జీవితమే స్ఫూర్తిగా జీవిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో జరిగిన జీఎంఆర్, మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుపై పౌర విమానయాన శాఖ మంత్రిగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతవాసిగా గర్వపడుతున్నాను అన్నారు. వలసలు వెళ్లే ప్రాంతంగా తమ ప్రాంతానికి గుర్తింపు ఉందన్నారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉత్తరాంధ్ర పైన శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. వారి ప్రత్యేక శ్రద్ధ వల్ల గత 18 కొత్త మార్పులు ఉత్తరాంధ్రలో వచ్చాయన్నారు. వారి నాయకత్వంలో విశాఖ గానీ, ఉత్తరాంధ్ర ప్రపంచ కేంద్రంగా మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఏవియేషన్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అది కేవలం ఒక ప్రాంతం, ఒక దేశానికి పరిమితమైన అంశం కాదన్నారు. నేడు ఏవియేషన్ రంగం ఇంతలా ఎదిగిందంటే అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాస కారణం అన్నారు. 2014లో నరేంద్ర మోదీ సర్కార్ ఏర్పాటైన తరువాత కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక గజపతిరాజు బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. వారు వేసిన పునాదుల కారణంగా నేడు 12 శాతం వృద్ధి రేటుతో ఏవియేషన్ రంగం ముందుకు సాగుతోందన్నారు.
నేటికి గుర్తు చేసుకుంటారు
నేటికి విమానయాన రంగంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అశోక గజపతిరాజును గుర్తు చేసుకుంటారన్నారు. సాధారణ వ్యక్తి సైతం విమానంలో ప్రయాణించే స్థితికి రావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 800ల విమానాలు ఉన్నాయన్నారు. అదనంగా మరో 1700ల విమానాలను ఆర్ఢర్ చేశారన్నారు. వాటి సంఖ్య భవిష్యత్తులో 3000లకు పెరగనుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఒక్కో విమానానికి అనుగుణంగా వంద రకాల ఉద్యోగాలు వస్తాయన్నారు. అయితే నిపుణుల లోటు ఉందని తెలిపారు. ఆ నిపుణుల లోటును తీర్చడంలో ఏపీ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే శిక్షణ పొందేలా ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన నుంచి పుట్టిన ఈ అంశం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రపంచపటంపై నిలుపుతుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న నలభై ఏళ్ల భవిష్యత్తును చూడగలిగిన దార్శనికత సీఎం చంద్రబాబు నాయుడుది అని కొనియాడారు. ఏ సబ్జెక్ట్ అయినా అవలీలగా ఆయన ఆకళింపు చేసుకోగలరని చెప్పారు.
త్వరలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
భోగాపురం ఎయిర్ పోర్టును త్వరలోనే ప్రారంభించుకోనున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జూన్ 2026 నాటికి ప్రారంభించాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నెల ముందుగానే ప్రారంభించేందుకు పని చేస్తున్నామని తెలిపారు. అందులో మంత్రి నారా లోకేష్ సహకారంతో కూడా ఉందన్నారు.
ఉత్తరాంధ్రకు అదృష్టం
పూసపాటి రాజ కుటుంబం ఉండడం ఉత్తరాంధ్ర ప్రజలకు అదృష్టం అని కేంద్రమంత్రి అన్నారు. ప్రాంతంలోని ప్రతి కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి ప్రభావం ఉంటుందన్నారు. విద్యా రంగం అభివృద్ధి కోసం పూసపాటి కుటుంబం చేసిన త్యాగం ఎనలేనిదన్నారు. కోట్ల రూపాయల భూములను ఎంతో తేలికగా ఇచ్చారన్నారు. జీఎంఆర్, మాన్సాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కలిసి పని చేయడం ఉత్తరాంధ్రకు కొత్త శక్తినిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.






