భారత్‌ను భయపెడుతున్న పెను సంక్షోభం.. 7 నెలల తర్వాత ఇబ్బందులే..

by  |
power companies
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బొగ్గు గనులు, పవర్ ప్లాంట్స్ అధికంగా ఉన్నాయి. విద్యుత్ ను ఇష్టానుసారంగా వినియోగిస్తామంటే పప్పులో కాలేసినట్టే. 24 గంటల విద్యుత్‌ను ఆస్వాదిస్తున్న ప్రజలకు మరికొద్ది నెలల్లోనే తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది కేవలం ఒక్క రాష్ట్రానికి చెందిన అంశం కానే కాదు. ఇది దేశం మొత్తం ఎదుర్కోబోయే సమస్య. ఎందుకంటే.. దేశంలో వినియోగించే విద్యుత్ దాదాపు 70 శాతం బొగ్గుతోనే ఉత్పత్తి అవుతుంది. దేశంలో విద్యుత్ ఉత్పత్తి క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. 2019 సంవత్సరం విద్యుత్ వినియోగంతో పోల్చితే ఈ ఏడాది 17 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో పాటు బొగ్గు ధరలు కూడా 40 శాతం మేర పెరిగాయి. దీనికి సరిసమానంగా బొగ్గు నిల్వలు కూడా తగ్గిపోతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే దేశంలోని గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అతి పెద్ద దేశం కావడంతో ఎంత విద్యుత్ ఉత్పత్తి అయినా సరిపోవడం లేదు. అంతేకాకుండా భారతదేశం బొగ్గు నిల్వల్లో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ బొగ్గు దిగుమతుల్లోనూ రెండో స్థానంలో ఉంది. అయితే, మరో ఆరు నెలల వరకూ బొగ్గు నిల్వలు సరిపోయే అవకాశం ఉందని, కానీ అప్పటివరకు ప్రత్యామ్నాయంగా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటేనే మంచిదని ఓ అధికారి చెప్పినట్లు ఓ నేషనల్ మీడియా ప్రచురించింది.
అయితే, ఇది ఇలాగే కొనసాగితే, ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ తిరిగి దారిలోకి రావడానికి చాలా కష్టపడుతుందని, దేశంలోని బొగ్గు సరఫరాలో 80% బాధ్యత వహించే ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ చీఫ్ శ్రీమతి జోహ్రా ఛటర్జీ హెచ్చరించారు. అయితే, 140 కోట్ల ప్రజలు ఉన్న భారత్ తో విద్యుత్ సమస్య తీర్చడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాల్. అయితే, థర్మల్ పవర్ మీద ఎంత ఆధారపడినా.. విద్యుత్ డిమాండ్ ని తీర్చడం కష్టమే అంటున్నారు నిపుణులు. దేశంలోని ఎన్నో ఇండస్ట్రీలు, కంపెనీలు విద్యుత్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ విద్యుత్ సంక్షోభం వస్తే ప్రతి ఒక్క వస్తువు ధర ఆకాశాన్నంటుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed