కమలంలో కలవరం.. సాగర్‌లో అభ్యర్థి వేట

by  |
nagarjuna Sagar, bjp Party
X

కమలం పార్టీలో సాగర్ అభ్యర్థి ఎవరనే కలవరం మొదలైంది. అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదితారెడ్డి ప్రచారం ప్రారంభించినప్పటికీ ఆమెకు టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే విషయమై పార్టీ ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. టీఆర్ఎస్ లో టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. వారిలో టికెట్ రాని వారిని పార్టీలోకి లాగి బరిలోకి దింపాలన్నది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో దీటైన అభ్యర్థిని నిలబెట్టి విజయం సాధించాలనే ఆలోచన ఉన్నప్పటికీ అలాంటి అభ్యర్థి దొరక్కపోవడం బీజేపీని గందరగోళంలో పడేసింది. ఇప్పటికీ అక్కడ ఎవరు దీటైన అభ్యర్థి, ఎవరిని నిలబెట్టాలి అనే అంశాలపై ఆ పార్టీ నేతలకు స్పష్టత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదితా రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ ఆమెకు టికెట్ ఇవ్వాలో వద్దో పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఆ విషయంలో ఆమెకు కూడా స్పష్టత లేదు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం ఉండటంతో బీజేపీ ‘యాదవ’ సామాజిక వర్గానికి చెందినవారిని నిలబెట్టాలనుకుంటున్నది. ఇందుకోసం కడారి అంజయ్య యాదవ్ పేరును పరిశీలిస్తోంది. ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. ఇదిలా ఉండగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చినంతటి ఘన విజయం నాగార్జునసాగర్‌లో వస్తుందా అనే అనుమానాలూ ఆ పార్టీ రాష్ట్ర నేతలను టెన్షన్ పెడుతోంది. టీఆర్ఎస్‌కు చెందిన ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలతో మంతనాలు జరిపిన బీజేపీ ఆ ఇద్దరిలో టికెట్ రాని వ్యక్తిని చేర్చుకుని నిలబెట్టాలని యోచిస్తున్నది. దీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత జానారెడ్డి బలాన్ని, సిట్టింగ్ స్థానంగా ఉన్నందున అధికార పార్టీకి సాగర్‌లో ఏమేరకు ప్రజాదరణ ఉంది లాంటి అంశాలపై ఆరా తీస్తోంది. గెలుపును ఖాయం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ అది సాధ్యమయ్యేనా అనే అనుమానాలూ ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రెండో స్థానంతోనే సరిపెట్టుకోవడమా?

గెలుపు సంగతేమోగానీ రెండో స్థానమైనా సాకారమవుతుందా అనే అభిప్రాయాన్ని బీజేపీకి చెందిన ఒకరిద్దరు వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంటామని పైకి గొప్పగా చెప్పుకుంటున్న సమయంలో నాగార్జునసాగర్‌లో గెలవడం తప్పనిసరి అవసరమని, కానీ ఆ స్థాయిలో బలమైన అభ్యర్థి ఎంపిక సంక్లిష్టంగా మారిందనేది వారి అభిప్రాయం. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉంటుందన్నది బీజేపీ అంచనా. కానీ టీఆర్ఎస్‌ను సవాలు చేస్తున్న సమయంలో ఆ పార్టీకంటే ఎక్కువ ఓటు బ్యాంకును పొందకపోతే అభాసుపాలవుతామన్న ఆందోళన వెంటాడుతోంది. సోషల్ మీడియాలో అన్ని పార్టీలకంటే దూకుడుగా ఉండే బీజేపీ సాగర్ ఎన్నికల విషయంలో మాత్రం ఆ తరహాలో ప్రజల ఆదరాభిమానాలను చూరగొనలేకపోయిందనే భావన రాష్ట్రస్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి పేరు ఖరారైపోయినా టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. ఆ పార్టీ అభ్యర్థి ఎవరో తేలిన తర్వాతనే బీజేపీ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. టీఆర్ఎస్ తరఫున కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఇద్దరిలో టికెట్ రాని వ్యక్తిని లాక్కోవడమా లేక అప్పటి పరిస్థితులకు తగినట్లుగా మరో వ్యక్తిని బరిలోకి దించడమా అనేది ప్రస్తుతం ఆ పార్టీ నేతలకు ఉన్న ఆలోచన.

అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి?

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇలాంటి డైలమా పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దీటైన అభ్యర్థులు ఆ పార్టీకి దొరకడం సాధ్యమేనా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగానే సాగుతోంది. దుబ్బాకలో అభ్యర్థి విషయంలో ఎలాంటి ఢోకా లేదు కాబట్టి అన్ని పార్టీలకంటే ముందుగానే ప్రచారం చేయడం, ఆయన సెగ్మెంట్ కు సుపరిచతుడు కావడం విజయానికి దోహదపడింది. కానీ అన్ని నియోజకవర్గాల్లో ఆ తరహా సానుకూల పరిస్థితులు లేవన్నది ఆ పార్టీకి బాగానే తెలుసు. ఏక కాలంలో టీఆర్ఎస్‌ను, కాంగ్రెస్‌ను ఢీకొట్టడం బీజేపీకి సవాలుగా మారింది. ‘కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము’ అని బీజేపీ పైకి చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు పటిష్టంగా ఉందనే అంచనా లేకపోలేదు. దుబ్బాకలో డిపాజిట్ కూడా రాదు అనే పరిస్థితుల్లో పాతికవేలకంటే ఎక్కువ ఓట్లను పొందింది అనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్‌లో గెలుపు బీజేపీకి కత్తిమీద సాములా మారింది. ప్రజాదరణ ఉన్న అభ్యర్థి ఎంపిక ఒక అంశమైతే క్షేత్రస్థాయిలో ఓటర్లను అనుకూలంగా మల్చుకోవడం మరో అంశంగా మారింది. ఇప్పటికింకా బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగలేదు. ఈ నెల చివరకు షెడ్యూలు విడుదల కావచ్చన్న అంచనాతో ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారైన తర్వాత మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకోనుంది.


Next Story

Most Viewed