ప్రాజెక్టులపై ఇద్దరు సీఎంలే తేల్చుకోవాలి

by  |
Retired Engineers
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం సరికొత్త మలుపు తిరిగింది. రెండు నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్, రెగ్యులేషన్ లాంటి అంశాలన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుని కృష్ణా, గోదావరి బోర్డుకు అప్పజెప్పింది. ఈ మేరకు గెజిట్‌ను కూడా జారీ చేసింది. రాష్ట్రాల పరిధిలోని నీటి అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోవడంతో కేంద్రపాలిత ప్రాంతాల తరహా పాలన అమల్లోకి వచ్చినట్లయిందని రిటైర్డ్ ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోడానికి ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని చర్చలు జరపాలని, అప్పటికీ పరిష్కారం కాకపోయినట్లయితే ట్రిబ్యునల్‌లో తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు చంద్రమౌళి ఈ విజ్ఞాపనపత్రాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన గెజిట్ ప్రకారం కృష్ణా, గోదావరి నదుల మీద నిర్మాణమైన మైనర్ ప్రాజెక్టులు మినహా మిగిలినవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యాజమాన్య బోర్డుల చేతుల్లోకి వెళ్ళాయని, రాష్ట్రాలకు హక్కులు ఉన్నప్పటికీ వాటిని వదులుకున్నట్లయిందని పేర్కొన్నారు. గెజిట్ ప్రకారం అక్టోబరు 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్ళనున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడం ఉత్తమమని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు ఆ లేఖలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు సూచించారు. రాష్ట్రాల స్థాయిలో పరిష్కరించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని నివారించుకోవచ్చని వివరించారు.

గతంలో కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం లాంటిదే ఇకపైన జరిగే చర్చల్లో కూడా రూపొందించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లుగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేంత వరకు లేదా, ఇప్పుడు పనిచేస్తున్న జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రక్రియను ముగించి తుది తీర్పును ఇచ్చేంతవరకు తాత్కాలిక ఒప్పందం ప్రకారమే జలాల వాటా, కోటాలను నిర్ణయించుకోవాలని సూచించారు.

ఒకవేళ అప్పటికీ పరిష్కారం కుదరకపోయినా, ఏకాభిప్రాయం రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఈ గెజిట్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదా అజమాయిషీ చేయడానికి ఆస్కారం ఇవ్వకూడదని రిటైర్డ్ ఇంజనీర్ల విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed