TRS: ఈటలపై మరో భారీ స్కెచ్.. రెడ్డీలను రెడీ చేస్తోన్న టీఆర్ఎస్!

by  |
TRS, Etela Rajender, cm kcr
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రెడ్డి నేత‌ల‌ను స‌మీక‌రించ‌డంలో బిజీగా ఉందా..? ఈట‌ల అనుచ‌రులు బీసీ నినాదం వినిపిస్తున్న వేళ‌.. అదే వారికి మైన‌స్సయ్యేళ్లా పావులు క‌దుపుతోందా..? రెడ్డి నేత‌లు ఈట‌ల వెంట వెళ్లకుండా పార్టీ ప‌ద‌వులు, నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ చూపుతోందా..? ఇప్పటికీ ఈట‌ల బాట విడిచి అధిష్టానం వైపు వెళ్తున్న వారిలో అత్యధికులు రెడ్డిలేనా..? అంటే తాజా ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ క్యాడ‌ర్‌ను చీల్చేయ‌డంలో టీఆర్‌ఎస్ అధిష్టానం స‌ఫ‌లీకృత‌మ‌వుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. రాజేంద‌ర్ వెంట ఉన్న నేత‌ల్లో అనేకులు బీసీ నినాదం వినిపిస్తున్న వేళ‌… టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం రెడ్డి, వెల‌మ సామాజిక‌ స‌మీక‌ర‌ణం చేప‌డుతున్నట్లుగా ప‌రిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఈట‌ల వెంట ఉన్న రెడ్డి నేత‌లు గ‌డిచిన వారం రోజులుగా క్రమంగా తిరుగుబాట్లకు పూనుకోవ‌డం వెనుక అధిష్టానం ప‌ద‌వుల ఆఫ‌ర్లు ఉన్నాయ‌ని పార్టీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదీ నియోజ‌క‌వ‌ర్గం పొలిటిక‌ల్ ట్రాక్‌..

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై మొద‌ట్నుంచీ రెడ్డి, వెల‌మ సామాజిక వ‌ర్గం నేత‌ల‌కే ప‌ట్టుంది. నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల చ‌రిత్రను ప‌రిశీలిస్తే.. 1967 ఎన్నిక‌ల నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా జ‌న‌ర‌ల్ స్థానంగా ఉంటూ వ‌స్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆవిర్భావం నుంచి మొత్తం 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో 13 సాధార‌ణ ఎన్నిక‌లు కాగా రెండు సార్లు 2008, 2010లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే టీఆర్ఎస్ 2004 నుంచి ఇక్కడ టీఆర్ఎస్ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తూ వ‌స్తోంది. 2004, 2008 (ఉపఎన్నిక‌లో) కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో క‌మాలాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దయింది. క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మండ‌లాల‌ను హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి రావ‌డంతో 2009 నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ వ‌చ్చారు. ఇప్పటి వ‌రకు మొత్తంగా ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగు సార్లు విజ‌యం సాధించారు. క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు విజ‌యం సాధించారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ మిన‌హా ఒక్కసారిగా కూడా బీసీ నేత ఎమ్మెల్యేగా విజ‌య సాధించ‌లేదు. ఆ మాటకొస్తే పోటీ చేసిన‌వాళ్లు కూడా బ‌హు అరుద‌నే చెప్పాలి. ప్ర‌ధాన పార్టీల నుంచ‌యితే బీసీ నేత‌లెవ‌రికీ పోటీ చేసే అవ‌కాశమే రాలేదు. రెడ్డి, వెల‌మ సామాజిక వ‌ర్గం నేత‌ల‌కే టికెట్లు ద‌క్కాయి. అందుకే మొద‌ట్నుంచి కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం రెడ్డి నేత‌ల చేతుల్లోనే ఉంది. కానీ ఈట‌ల ఆగ‌మ‌నంతో ఇక్కడ రెడ్డి, వెల‌మ సామాజిక వ‌ర్గం నేత‌లు ప‌వ‌ర్ లీడర్లుగా ఎదిగే అవ‌కాశం చేజారింది. పార్టీ, వ్యక్తిగ‌త చ‌రిష్మాతో ఈట‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురు లేకుండా పోయింద‌నే చెప్పాలి. అయిత ఇప్పుడు టీఆర్ఎస్‌కు ఈట‌ల‌కు గ్యాప్ పెరిగి ఆయ‌న్ను ప‌క్కన పెట్టేయ‌డంతో అనేక‌మంది రెడ్డి, వెల‌మ నేత‌ల చూపు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆప‌రేష‌న్ ఈట‌ల‌ను స్టార్ట్ చేసిన అధిష్ఠానంకు కొంత‌మంది రెడ్డి, వెల‌మ సామాజిక వ‌ర్గం నేత‌లు స్వత‌హాగా ద‌గ్గర‌వుతుండ‌గా… ఈట‌ల వెంట న‌మ్మకంగా ఉంటున్న మ‌రికొంత‌మంది అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు ప‌ద‌వుల ఆశ‌చూపుతూ పార్టీ వైపు లాగేసేయ‌త్నం జ‌రుగుతోంది.

ఈట‌ల సొంత మండ‌లం నుంచే ఆప‌రేష‌న్‌..

ఆప‌రేష‌న్ ఈట‌లను మొదలుపెట్టిన టీఆర్ఎస్ అధిష్టానం ఆయ‌న స్వగ్రామం నుంచే బ‌ల‌హీనం చేసేందుకు పూనుకుంటోంది. ఈట‌ల స్వగ్రామం క‌మ‌లాపూర్, మండ‌లంలో ఈట‌ల అనుకూల వ్యతిరేక వ‌ర్గాలుగా నేత‌లు చీలిపోయారు. క‌మ‌లాపూర్ మండ‌ల టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి సైతం కొంత‌మంది మండ‌ల నేత‌ల‌తో ర‌హ‌స్యంగా భేటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉంటే ప‌ద‌వులు ద‌క్కేలా చూస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇప్పటికే మండ‌ల సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎర్రం ఇంద్రసేనారెడ్డి, పింగిలి ప్రదీప్‌రెడ్డి, ప‌రిపాటి ర‌వీంద‌ర్‌రెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండ‌ల అధ్యక్షుడు సంప‌త్‌రావు వంటి వారు ఈట‌ల‌పై విమ‌ర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తంగా రెడ్డి, వెల‌మ సామాజిక వ‌ర్గం నేత‌లూ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుండ‌గా.. మ‌రి బీసీ నేత‌ల వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంద‌న్నది వేచి చూడాలి.

Next Story

Most Viewed