నేడే ఏడుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు దసరా పండుగ రోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (ఫస్ట్ కోర్టు) హాలులో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. హైకోర్టు న్యాయమూర్తులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా నిర్దిష్ట షెడ్యూలును కూడా రిజిస్ట్రార్ జనరల్ రూపొందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత నెలలో ఏడుగురు జడ్జీల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ బుధవారం గెజిట్ విడుదల చేసింది.

ఆ ప్రకారం కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్‌కు చెందిన న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో నలుగురు మహిళలే. పేరుగు శ్రీసుధ, చిల్లకూరు సుమలత, గురిజాల రాధారాణి, పట్లోళ్ళ మాధవీదేవి, మున్నూరి లక్ష్మణ్, అద్దుల వెంకటేశ్వర్‌రెడ్డి, నూన్సావత్ తుకారాంజీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed