చదువెందుకు నాన్నా

by  |
disha kathasravanthi
X

– ‘దిశ-కథాస్రవంతి’ కథల పోటీలో రెండో బహుమతి పొందిన కథ

నేను స్కూలుకెందుకు వెళ్లాలి నాన్నా? ఏడుస్తూనే, తనని బెత్తంతో కొడ్తున్న తండ్రిని అడిగాడు చంటి. చంటి మరెవరో కాదు స్వయానా నా తమ్ముడు రమణ కొడుకు. నాకే ఎదురు చెప్తావా? అని రమణ మరో రెండు తగిలించాడు. మూడో దెబ్బ తగిలేలోపలే చంటి చాకచక్యంగా తండ్రి చేతిలోని కర్రని ఒడిసి పట్టుకున్నాడు. వాడలా పట్టుకోగానే ఆ కర్రని లాక్కొని తండ్రినే తిరిగి కొడతాడేమోనని నేను భయపడ్డాను. కానీ, ‘నాన్నా నేనో ప్రశ్నడుగుతాను. పెద్దనాన్న బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ చివరికి ఓ కారు, ఓ ఇల్లు సంపాదించాడు. మీరు కూడా బాగా వ్యవసాయం చేసి చివరికి అవే సంపాదించారు. చేరుకొనే లక్ష్యం ఒకటే ఐనప్పుడు మార్గాలు వేరైతే ఏంటి? అందుకే నేనిప్పుడు చదువుకొని ఉద్యోగమే ఎందుకు చేయాలి, వ్యవసాయమెందుకు చేయకూడదు?’ అని అనేసరికి రమణకి పడిపోయింది. నేను పక్కింటి వాకిట్లోంచే గమనిస్తూ తలదించుకొన్నాను.

చిన్నప్పుడు నా తమ్ముడు రమణ కూడా చంటిలాగే నాతో వాదించి చదువు పక్కనెట్టేసి వ్యవసాయం చేశాడు. అందుకే రమణకి నాకు చిన్నప్పటినుండి కాస్త పొసగదు. కానీ వాణ్ణి అడుగడుగునా తప్పటడుగు వేయకుండా కాపాడుకొంటూ వచ్చాను. నేనది ప్రేమనుకొన్నాను, వాడు నరకమనుకొన్నాడు. అందుకే నాతో మాట్లాడకుండా మొహం చాటేస్తుంటాడు. అయినా నేను ఏనాడూ నిరుత్సాహపడలేదు. వ్యవసాయం చేసైనా నాకు సరిసమానంగానే సంపాదిస్తున్నాడని సంతోషించాను. అందుకే వాడి పిల్లలైనా చదివితే బాగుండని ఆశపడితే చంటి పదో తరగతి పాసవ్వడానికే ఎన్నో ప్రశ్నలతో ఎదురుతిరిగాడు. నేను కాస్త చనువు తీసుకొని చంటికి సర్దిచెద్దామంటే రమణ ఏమైనా అనుకొంటాడేమోనని నా భయం. అందుకే నా ఇంటి వాకిట్లోనే నిలబడి రమణ ఇంటి వాకిటి తతంగమంతా చూస్తుండిపోయాను. చంటి అడిగిన ప్రశ్నకి రమణ సమాధానం చెప్పలేక తలదించుకొన్నాడు. నేను బిత్తరచూపులు చూడటం తప్పా మరేం చేయలేకపోయాను. నా తమ్ముడు తన కొడుకు అడిగిన ప్రశ్నకేం సమాధానం చెప్తాడోనని ఎదురుచూడసాగాను. నేను ఊహించని రీతిలో రమణ చంటి చేతిని పట్టుకొని పొలంవైపు లాక్కెళ్లిపోయాడు. కుతూహలంగానూ, రమణ నా మీదున్న కోపంతో చంటినేమైనా చేస్తాడేమోనన్న భయంతోనూ నేనూ వాళ్ల వెనకాలే పరుగుతీశాను.

మా నాన్నగారి ద్వారా మాకొచ్చినా ఆరెకరాల పొలం గట్టుమీద తన కొడుకుని నిలబెట్టి రమణ ఏదో చెప్పబోతుండగా, నేను వాళ్లమాటలను వినాలన్నా తహతహతో దొంగచాటుగా, దగ్గరగా ఉన్నా పొదల్లో దాక్కొండిపోయా. రమణ తన కొడుకుతో ‘చంటీ, ఇక మీదట నువ్వు వ్యవసాయం చేయాల్సిన పొలం ఇదే. నేను సంపాదించిన కారు, ఇల్లు ఇందులో పంట పండిస్తేనే రాలేదు. వాటి కోసం నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. వ్యవసాయమన్న మాటేగానీ, డబ్బు సంపాదించి డాబుగా తిరగడానికిది పనికిరాదు. నాకు తెలిసిందాన్ని బట్టి, మనకున్నదంతా పొలంపై ఖర్చుచేసి ప్రతిఫలాన్ని ఈ ప్రపంచానికి పంచేస్తూ చేసే సహాయమే వ్యవసాయం. ఇందులో రైతే అందరికీ సహాయం చేసినట్లుగా అనిపించినా, వాస్తవానికి ఆ రైతుకే అడుగడుగునా సహాయం కావాలి. విత్తనాలు వేయగానే వానరూపంలో దేవుడి సహాయం, విత్తనాలు మొక్కలయ్యాకా కలుపుతీతకి డబ్బు సహాయం, పంట చేతికొచ్చే ముందు ప్రకృతి వైపరీత్యాలు, పంటని పాడుచేసే కీటకాలు, తనని చూసి ఓర్వలేని కుళ్లుకుతంత్రాల మనుషులు తనని ఏమనకుండా వదిలేసే సహాయం, పంటచేతికొచ్చాక దళారుల చేతిలో నుండి తప్పించుకొని మంచిధరకి అమ్ముకోగలిగే అవకాశాల సహాయం, పంటనమ్మిన డబ్బుని ఇంటికి జాగ్రత్తగా చేర్చగలిగే లోకజ్ఞానం. ఇలా ఒక్కటేమిటి రైతుపడే సంఘర్షణలో అనుక్షణం సహాయం అవసరం.

వ్యవసాయమంటే ఓ వృత్తి కాదు, ఓ అలుపెరుగని పోరాటం. ఇందులో ఏ క్షణానికి కూడా భరోసా లేదు. అదే ఓ ప్రభుత్వ ఉద్యోగి జావితానికీ, జీతానికీ చాలా భరోసా ఉంటుంది. రైతుపడే సంఘర్షణ కంటే ఓ ఉద్యోగి పడే సంఘర్షణ చాలా తక్కువ. ఈ ఆరెకరాల పొలానికి చుట్టూ ఉన్నా ఇనుప కంచెలాంటిదే ఉద్యోగి జీవితం. ఈ కంచెని పీకేస్తే కనబడే పొలంలాంటిదే రైతు జీవితం. కంచెలేని పొలాన్ని ఎవడైనా ఆక్రమించొచ్చు, పశువులొచ్చి పంటని నాశనం చేయొచ్చు, దొంగలొచ్చి పంటని దోచుకోవచ్చు, ఇంకా ఏదైనా జరగొచ్చు.’

కానీ, ఉద్యోగి జీవితంలో ఇలాంటి సవాళ్ళుండవు. ఓ ఉద్యోగి ఈ సమాజంలో ఎక్కడికెళ్లినా గౌరవం ఉంటుంది, అదే రైతుని గౌరవించేవాడెవడు? ఉద్యోగి తనకున్న పూర్తి స్వేచ్ఛతో తన హక్కుల్ని, అధికారాన్ని వినియోగించుకొంటాడు. అదే రైతు తనకు రావాల్సిందాన్ని పొందడానిక్కూడా అధికారులచుట్టూ అరికాళ్ళు అరిగిపోయేలా తిరగాలి. ఆ అధికారుల్ని చూసి చేతులెత్తి దండాలు పెట్టాలి. తనలో లేని నవ్వుని ప్రదర్శించాలి, అవసరమైతే ఏడ్వాలి. కాళ్ళు పట్టుకోవాలి, ఆవేశంలో అవినీతి అధికారి కాలర్ పట్టుకొంటే జైలుకెళ్ళాలి. తనకున్న పూర్తి అధికారాల్ని, హక్కుల్ని అనుభవించకుండా అనుక్షణం ఓ గందరగోళంలో ఉండే వ్యక్తి రైతు మాత్రమే. పంట అమ్మిన డబ్బులో ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ఎంతో ఆలోచిస్తాడు, ప్రపంచానికి తాను అన్నం పెట్టినా మనస్ఫూర్తిగా తన కడుపు నింపుకోవడానికి ప్రాణం దరియ్యక తటపటాయిస్తూ తల్లడిల్లిపోతాడు. తన కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఉద్యోగాన్ని అంకితభావంతో నిర్వర్తించని ఓ ఉద్యోగి కంటే తన పొలాన్ని తన కుటుంబంకంటే మిన్నగా ప్రేమించే ఓ రైతు ఎంతో ఉన్నతుడైనా అది వ్యక్తిత్వం వరకే కదా. వ్యక్తిత్వం అన్నం పెట్టదు, వ్యవసాయం మాత్రమే అన్నం పెడుతుంది. అయినప్పటికీ చివరికి ఉద్యోగే గెలుస్తుంటాడు.’

‘రైతు అనుక్షణం తాను గెలిచానో లేదోనన్న అనుమానంలోనే తర్జనభర్జన పడుతుంటాడు. ఇదే ఓ రైతు జీవితం’ ఇప్పుడు నువ్వే ఆలోచించుకో, చదువుకొని మా అన్నయ్యలా నీతిగా బతికే ఓ ఉద్యోగిగా మారతావో, లేకా అనుక్షణం గందగోళంలో ఉండే రైతుగా మారుతావో నిర్ణయించుకో’ అని రమణ తన కొడుకువైపు చూశాడు. చంటి తడుముకోకుండా, ‘నాన్నా మీరు ఇంతలా చెప్పాక కూడా ఒక్క అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది. మరి ఇల్లు, కారెలా సంపాదించారు?’ అని అడిగాడు. ఆ మాటకి నా గుండెలో బండరాయి పడినట్లైంది. ‘అవన్నీ మా అన్నయ్య సహాయంతో సంపాదించినవి. సంస్కారవంతమైన చదువుతో ఉద్యోగం మాత్రమే కాదు, ప్రతీ విషయానికీ తాద్యాత్మం చెందే మనసు కూడా అలవడుతుంది. మంచి విజ్ఞత, వివేకం, విశ్లేషణ, విచక్షణాజ్ఞానం, గొప్ప సంస్కారం చదువుతోనే వస్తాయి. నేను చదువును నిర్లక్ష్యం చేసి ఓడిపోయాననే భయంతోనే మా అన్నయ్యతో మాట్లాడడానికి భయపడేవాణ్ని. కానీ, మా అన్నయ్య నన్ను గెలిపించడానికి అనుక్షణం తపనపడుతూ ఉండేవాడు. తనలాంటి సంస్కారవంతమైన చదువు నీక్కూడా ఉండాలని నేను కోరుకోవడంలో తప్పులేదు కదా. తనకి ఈ పొలమంటే చాలా ఇష్టం, కానీ నన్ను గెలిపించే ప్రయత్నంలో తాను నాకు చౌకధరకే అమ్మేశాడు. నేను ఏదైనా పనిమీదా ఊరెళ్ళినప్పుడు నాకు తెలియకుండా తానొచ్చి ఈ పొలానికి కాపలాగా ఉండేవాడు.’

‘రైతు ఈ సమాజంలో రారాజే అయినప్పటికీ తన హక్కుల్ని, జీవితాన్ని, స్వేచ్ఛని ఈ సమాజం లాక్కొన్నాకా ఆ రాజుకున్న విలువేంటి. ఈ సమాజం ఎదుటి మనిషిని ఎప్పటికీ తన బానిసగా మార్చుకోవాలనే చూస్తుంది. కానీ, స్వేచ్ఛగా బతకాలంటే నిరంతర పోరాటం సాగిస్తూనే ఉండాలి ఆ పోరాటంతోనే స్వేచ్చాయుతమైన జీవితం దొరుకుతుంది, అదే నిన్ను బానిస సంకెళ్ల నుంచి విడిపిస్తుంది. ఆ జీవితం కేవలం ఒక్క చదువుతోనే సాధ్యం అవుతుంది. నన్ను చదువుకొమ్మని బెదిరించిన మా అన్నయ్యని నేను ఎప్పటికీ శత్రువుగానే భావించాను. కానీ, తన సంస్కారంతో తాను నన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. అదే చదువు నేర్పించే గొప్ప సంస్కారం. నేనెందుకు మా అన్నయ్యని ప్రేమించలేకపోయానో ఇప్పటికీ తెలియదు. నాకు ప్రేమని వ్యక్తపర్చడం రాదనుకొంటాను. నేను కూడా చదువుకొనుంటే మా అన్నయ్యలాగే అతన్ని తిరిగి ప్రేమించేవాడినేమో” అని రమణ కన్నీళ్లు తుడ్చుకున్నాడు.

అంటే! చదువుకోకపోతే ప్రేమించడమే రాదంటారా? మళ్ళీ చంటి అడిగాడు. అలా అని నేననను. చదువుకొంటే మా అన్నయ్యని ఇంకా గొప్పగా ప్రేమించేవాడిని కదా అని అంటున్నాను. నన్ను మా అన్నయ్య క్షమిస్తాడో లేదోనని కాస్త భయం… రమణ మాటలు జీరగా మారి బొంగురుపోయాయి. నా తమ్ముడి మాటలు విన్నాక నాకు తెలియకుండానే నా కళ్ళనుండి నీళ్ళు కారసాగాయి. వాడిలో ఉన్న భయాన్ని నా మీదా పెంచుకొన్న కోపంగా భావించి నేను రమణ విషయంలో తప్పు చేశాననిపించింది. ‘మరోసారి చదువుకోనని అనను. పెద్దనాన్నలాగే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తా” అని తన తండ్రి గుండెలపై వాలిపోయినా చంటిని పొదలచాటుగా చూసి నేను కళ్లు తుడ్చుకొన్నాను.

Rajesh-Khanna


ఎం. రాజేశ్‌ఖన్నా

పుణే
74482 53472


Next Story

Most Viewed