'నాలుగడుగుల' నిబంధన తప్పనిసరి !

by  |
నాలుగడుగుల నిబంధన తప్పనిసరి !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ‘ఎపిడమిక్ యాక్ట్’ను అమలులోకి తెచ్చింది. సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలుగు భాషలో కూడా విడుదల చేసింది. నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా పకడ్బందీ చర్యలను తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక జీవో (నెం. 14/23.03.2020)ను కూడా జారీ చేసింది. నిత్యావసరాల కోసం ఇంటికొక్కరు మాత్రమే వెళ్ళాలనే నిబంధనతోపాటు ప్రతి షాపు, సూపర్ స్టోర్ వినియోగదారులు గుమికూడకుండా ప్రతీ నాలుగు అడుగులకు ఒకరు నిల్చునేలా మార్కింగ్ చేయాల్సిందేనని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆ జీవోలో పేర్కొన్నారు. షాపుల యాజమాన్యం మార్కింగ్ చేసిన చోట మాత్రమే వ్యక్తులు నిల్చోవాలని, ఆ క్రమశిక్షణను పాటించడం వ్యక్తులుగా ప్రజల బాధ్యత మాత్రమే కాక షాపు నిర్వాహకుల బాధ్యత కూడా అని స్పష్టం చేశారు.

షాపు వెలుపల క్యూ పద్ధతిలో నిల్చునే ఏర్పాట్లతోపాటు ప్రతి నాలుగు అడుగులకు ఒకరు నిల్చునేలా ముద్రలను పెయింట్ చేయాలని, షాపు లోపల, బిల్లు కౌంటర్ల దగ్గర, వస్తువులు కొనే షెల్ఫుల దగ్గర కూడా ఇదే పద్ధతి కొనసాగాలని, ఆ బాధ్యత షాపు నిర్వాహకులదేనని ఆమె తేల్చి చెప్పారు. ఒకవేళ ప్రజలు క్రమశిక్షణ తప్ప ఒకరికొకరు దగ్గరగా నిల్చున్నట్లయితే వారికి ఆ పద్ధతి అర్థం చేయించి దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయాంచాల్సిన బాధ్యత కూడా షాపు యాజమాన్యానిదేనని పేర్కొన్నారు. గ్రూపులు గ్రూపులుగా జనం గుమికూడకుండా షాపు నిర్వాహకులు తగిన యంత్రాంగాన్ని నెలకొల్పాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎక్కడయినా ఉల్లంఘనలు జరిగినట్లయితే వారిపై ఐపీసీలోని 188, 269, 270 సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోవడం తథ్యమని ఆమె హెచ్చరించారు.

ప్రతి షాపు విధిగా ప్రవేశద్వారం దగ్గర శానిటైజర్లను నెలకొల్పాలని, వినియోగదారులు లోపలికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా దానితో చేతులు శుభ్రం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను పాటించాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. కార్మిక శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసులు, పట్టణాభివృద్ధి తదితర సంబంధిత శాఖల అధికారులు తరచూ దీన్ని పర్యవేక్షిస్తూ ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఆమె స్పష్టం చేశారు.

Tags : Telangana, Corona, Super Market, Foot Prints, Epidemic Act


Next Story

Most Viewed