సర్కార్‌కు అందిన డెడికేటెడ్ కమిటీ రిపోర్టు.. స్థానిక ఎన్నికల నిర్వహణే తరువాయి

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-21 01:47:40  IST  )

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించింది. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్ రావు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి నివేదిక అందించారు.

సర్కార్‌కు అందిన డెడికేటెడ్ కమిటీ రిపోర్టు.. స్థానిక ఎన్నికల నిర్వహణే తరువాయి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించింది. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్ రావు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి నివేదిక అందించారు. పంచాయతీల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండేలా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. అయితే సమయం లేకపోవడంతో సర్క్యూ లేషన్ విధానంలో మంత్రుల ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రంలోపు నివేదిక కేబినెట్ మంత్రుల ఆమోదం పొందనుంది. కేబినెట్ ఆమోదం అనంతరం రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేయనుంది. ఈ జీవో జారీ చేయగానే ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్దతను వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయనుంది. ఈ జీవోకు అనుగుణంగా జిల్లా అధికారులు రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈనెల 23న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్ను అందించాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లు, డీపీవోలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీవో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోల సమక్షంలో ఖరారు చేస్తారు. ఆ జాబితాను గెజిట్ రూపంలో కలెక్టర్ ప్రచురిస్తారు. ఈ జాబితాను ఎన్నికల కమిషన్కు పంచాయతీ రాజ్ శాఖ అందించనుంది. ఈనెల 24న కోర్టు ముందు విచారణ జరగనుంది. ఈ కేసు విచారణలో భాగంగా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ అందించనుంది. దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందించనుందో సోమవారం తేలనుంది. ఇటీవల ఖరారు చేసిన రిజర్వేషన్లు దాదాపుగా చాలా వరకు అవే ఉంటాయని, అయితే బీసీల రిజర్వేషన్ల స్థానాల్లో ఎక్కువ మార్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో తక్కువగా మార్పులకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ సీట్లు తగ్గి జనరల్ స్థానాలు పెరగనున్నాయి.

పంచాయతీ ఎన్నికల నిర్వహణ సిద్ధంగా ఉండాలి.. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో కలిసి కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో)లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాణికుముదిని మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) కు సంబంధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆమె కోరారు. నోటిఫికేషన్ రాగానే ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా చర్యలు తీ సుకోవాలన్నారు. ఒక ఇంట్లోని ఓటర్లంతా ఒకే వార్డు పరిధి లోకి వచ్చే విధంగా చూడాలని, భార్య ఒక వార్డులో, భర్త మరొ క వార్డులో ఉండకుండా ఒకే వార్డులో ఉండే విధంగా ఓటరు జాబితాను పరిశీలించి ఈనెల 23 కల్లా తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఓటరు జాబితాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దని, కొత్తగా ఓటర్లను చేర్చడం, తీసివేయడం చేయవద్దని సూచించారు. వార్డుల వారీగా మాత్రమే మ్యాపింగ్ చేయాలని స్పష్టం చేశారు.

మూడు దఫాలుగా నిర్వహణ.. డీజీపీ

గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాకుండా, ఒక ప్రాంతంలోని ఎన్నికలు పూర్తయిన తర్వాత, మరొక ప్రాంతంలో ఎన్నికలకు మధ్యలో కనీసం రెండు రోజుల విరామం ఉండాలని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఈ విరామం వలన సిబ్బందికి, భద్రతా బలగాలకు తగిన సమయం లభిస్తుందని, బందోబస్తు నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, మల్టీజోన్ -2 అడిషనల్ డీజీపీ డీఎస్ చౌహన్, మల్టీజోన్-1 ఐజీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, శాంతి భద్రతల ఏఐజీ రమణ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Next Story