తిమింగలం వాంతితో.. కోటీశ్వరురాలైన థాయ్ మహిళ

160

దిశ, ఫీచర్స్ : థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్ అనే మహిళ.. రిలాక్సేషన్ కోసం సమీపంలోని నాఖోన్ సి తమ్మరత్ ప్రావిన్స్ బీచ్‌కు వెళ్లింది. అక్కడ వాకింగ్ చేస్తున్న తనకు ఏదో వింత వస్తువు కనిపించింది. చూడ్డానికి బాగా లేకపోయినా, ఎందుకో ఆ వస్తువును తనతో పాటే ఇంటికి తెచ్చుకుంది. అదృష్టం తలుపు తడితే.. అంతే కాబోలు. వద్దనుకుంటూ ఇంటికి తెచ్చుకున్న ఆ వింత వస్తువు ఓ తిమింగలానికి చెందిన వాంతి(అంబర్‌గ్రిస్) కాగా, దాని విలువ కోట్ల రూపాయలు ఉండటంతో ఆమె ఆశ్చర్యపోయింది.

నియామ్రిన్.. తను ఇంటికి తెచ్చుకున్న వింత వస్తువు(తిమింగిలం వాంతి)ను తమ చుట్టుపక్కల వారికి చూపించింది. దాన్ని పరిశీలించిన వారు అది తిమింగలం వాంతని, సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారని తెలిపారు. కాగా నియామ్రిన్‌కు దొరికిన తిమింగలం వాంతి 24 ఇంచుల పొడువు, 12 ఇంచుల వెడల్పుతో సుమారు 6.8 కిలోల బరువు ఉంది. ఎంతో ఖరీదైన తిమింగలం వాంతిని ‘తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇతర జీవుల్ని ఆహారంగా తీసుకునే తిమింగలాలు.. వాటిని అరిగించుకునే క్రమంలో కడుపులో కొన్ని స్రవాలను విడుదల చేస్తాయి. ఆ తర్వాత ఇవి గట్టిపడి ‘వాంతి’ రూపంలో బయటకొస్తుంది. మొదట దుర్వాసన కలిగి ఉన్నా, ఎండిపోయిన తర్వాత స్వీట్, లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఇది హై-ఎండ్ పెర్ఫ్యూమ్ పరిశ్రమలో అధిక విలువను కలిగి ఉంటుంది. మందులు, పానీయాలతో పాటు మసాలాగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. చైనా, జపాన్, ఆఫ్రికా, అమెరికా తీరాలతో పాటు బహమాస్ వంటి ఉష్ణమండల ద్వీపాల్లో ఈ అంబర్‌గ్రిస్ తరచూ తేలియాడుతూ, ఒడ్డుకు చేరుకుంటుంది. సూర్యరశ్మి, గాలి లేదా సముద్రపు నీటికి తగిలినప్పుడు ఈ పదార్థం రంగు మారి, గట్టి పడుతుంది. ఈ క్రమంలోనే లేత బూడిదరంగు లేదా పసుపు రంగులోకి మారడంతో పాటు సువాసనను వెదజల్లుతుంది.

నియామ్రిన్ స్థానిక అధికారులను సంప్రదించి అంబర్‌గ్రిస్‌ను చూపించగా.. అది ఒరిజనల్ అంబర్‌గ్రిస్ అని, సుమారు రూ. 1.9 కోట్లు విలువ చేస్తుందని చెప్పారని తను వెల్లడించింది. అయితే అంబర్‌గ్రిస్ నిజమైనదా కాదా అని నిపుణులు ధృవీకరించాల్సి ఉంది. 2020 నవంబర్‌లో.. సువన్నాసాంగ్ అనే థాయ్ జాలరికి అతిపెద్ద అంబర్‌గ్రిస్ 220 lbs (100 కిలోలు) బరువుగలది దొరకగా, దీనికి రూ. 24.4 కోట్ల ధర పలికింది. 2016 నవంబర్‌లో ముగ్గురు ఒమానీ మత్స్యకారులకు దొరికిన 176 పౌండ్ల (సుమారు 80 కిలోలు) అంబర్‌గ్రిస్ విలువ రూ.153 కోట్లు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..