డాక్టర్ల హెచ్చరిక.. డయాలసిస్​ పేషెంట్లలో టెన్షన్..

by  |
Dialysis Patients
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ కిడ్నీ వ్యాధిగ్రస్తులంటే కరోనాతో ఐరన్​… ఆయస్కాంతం సంబంధం. వైరస్​ వ్యాప్తి వెంటనే జరుగుతోంది. అందుకే డయాలసిస్​చేసుకుంటున్న పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి..” అంటూ ఏకంగా డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డయాలసిస్​ పేషెంట్లకు కరోనా కష్టాలు ఎదురవుతున్నాయి. కేవలం హైదరాబాద్​లోనే నెలనెలా మందులు ఇవ్వాల్సి వస్తుండటంతో స్థానికంగా వచ్చి తెచ్చుకోవడం ప్రాణాలతో చెలగాటమే అవుతోంది. ఇప్పుడు సెకండ్​వేవ్​తో మరింత ముప్పు పొంచి ఉంటోంది.

ఇచ్చేదే తక్కువ

కిడ్నీ మార్పిడి పేషెంట్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే. ప్రతినెలా మందుల కోసం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారికి గతంలోనే ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. ఆరోగ్య శ్రీ కింద కిడ్నీ మార్పిడి చేయించుకున్న పేషెంట్లకు ప్రతినెలా రూ. 9,500 చొప్పున మందుల కోసం విడుదల చేస్తోంది. రూ. 9,500 విలువైన మందులను హైదరాబాద్​లోని నిమ్స్​, ఉస్మానియా ఆస్పత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా పేషెంట్లు వచ్చి ఈ రెండు దవఖానాల్లో తీసుకోవాల్సిందే. మందుల కోసం దాదాపుగా రెండు రోజులు నిమ్స్​, ఉస్మానియాలో ఉండాల్సి వస్తోంది. వచ్చిన ప్రతిసారి నమునాలు, రిపోర్టులు చూడటం, వైద్యుల కోసం వెయిటింగ్, కావాల్సిన మందులు అందుబాటులో పెట్టకపోవడం తదితర కారణాలతో రెండు రోజులు ఉండి మందులు తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్నంత మేరకు రూ. 9,500 మేరకు మందులు ఇస్తారు. కానీ వాస్తవానికి వీటికి అదనంగా మరో రూ. 4 వేల వరకు బయట కొనుక్కోవాల్సిందే.

ఇప్పుడెలా..?

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నుంచి వేల సంఖ్యలో డయాలసిస్​ పేషెంట్లు వచ్చి మందులను తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెకండ్​వేవ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో డయాలసిస్​ పేషెంట్లు హైదరాబాద్​కు వచ్చి మందులు తీసుకోవడం ప్రమాదకరంగా మారుతోంది. త్వరగా కరోనా వైరస్​ బారిపడే అవకాశాలుంటున్నాయి. డయాలసిస్​ పేషెంట్లకు కరోనా సోకితే బతకడం కూడా చాలా కష్టమని వైద్యులే హెచ్చరిస్తున్నారు. కొంతమంది వైద్యులు వారిని రావద్దంటూ సూచిస్తున్నారు. కానీ రూ. 15వేల వరకు వెచ్చించిన బయట కొనుక్కోలేని పరిస్థితి ఉందని, ఇప్పుడు రావద్దంటే ఎలా అంటూ మధనపడుతున్నారు.

స్థానికంగా ఇస్తే బెటర్​

కరోనా సమయంలో స్థానికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఇచ్చే మందులను అందుబాటులో పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఈ రెండు ప్రధానాస్పత్రులకు వచ్చి మందులను తీసుకునే పరిస్థితులు లేవని, అందుకే ఆయా పేషెంట్ల జాబితా ఆధారంగా మందుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంటే స్థానికంగా అందుబాటులో ఉన్న పీహెచ్​సీలకు పంపించాలని కోరుతున్నారు. ఒకవేళ ఇలా సాధ్యం కాని పక్షంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులకు నగదు సాయం చేసినట్టుగా ప్రభుత్వం మందుల కోసం ఇచ్చే రూ. 9,500ను పేషెంట్ల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న చోట కొనుగోలు చేసుకుంటారని వివరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నారు.

అవయమార్పడి వారికే ఎక్కువ ప్రమాదం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కిడ్నీ మార్పిడి పేషెంట్లకు స్థానికంగా మందులు ఇచ్చే విధంగా చేయాలి. లేకుంటే ఈ మందుల కోసం హైదరాబాద్​కు వస్తే కరోనా చావుల కంటే ఈ అవయవమార్పిడి పేషెంట్లే ఎక్కువ చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే డయాలసిస్​ పేషెంట్లకు త్వరగా వైరస్​ అంటుకుంది. దీంతో కోలుకోవడం కష్టం. వెంటనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. డయాలసిస్​ పేషెంట్లను ఆదుకోవాలి.
– భగవాన్​రెడ్డి, సిద్ధిపేట


Next Story

Most Viewed