చెక్​డ్యామ్ టెండర్లలో గులాబీల దందా

by  |
చెక్​డ్యామ్ టెండర్లలో గులాబీల దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌ డ్యామ్ పనుల టెండర్ల వ్యవహారంలో గులాబీ నేతలు చక్రం తిప్పుతున్నారు. ప్రజాప్రతినిధులు సిండికేట్‌గా మారి బెదిరింపులకు దిగి, మూడు నుంచి నాలుగు శాతం వరకు అధిక ధరలు కోట్‌ చేసి పనులను సొంతం చేసుకుంటున్నారు. ఎవరెవరు ఎక్కడ టెండర్లు వేయాలి? ఎవరికి ఎక్కడ పనులు దక్కాలి? అనే అంశాలను ముందుగానే చర్చించుకుంటున్నారు. అంతా లెస్​కు టెండర్లు వేస్తుంటే, ఇక్కడ మాత్రం ఎక్సెస్​కు వేసి పనులను పంచుకున్నారు.

ఒక్కోచోట ఒకటీ, రెండు టెండర్లు మాత్రమే వచ్చాయంటే ఎంత మేరకు పంచుకున్నారో తెలిసిపోతోంది. ఇందుకోసం మంత్రులు చక్రం తిప్పారు. తమ కుటుంబ సభ్యులు, బినామీలతో ఉన్న నిర్మాణ సంస్థలకు అండగా నిలిచారు. ఎవరైనా పోటీకి వస్తే పనులు చేయలేరంటూ బెదిరింపులకు దిగారు. అయినా టెండర్లు వేసిన ఒకరిద్దిరిని స్వచ్ఛందంగా తొలగిపోయేలా చేశారు. పోటీ లేకపోవడంతో వారికే పనులు దక్కాయి. ముగ్గురు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేల సంస్థలు, బినామీ కంపెనీలకే ఈ పనులు దక్కాయని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో రూ. 2,890 కోట్లతో 632 చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు లభించాయి. గోదావరి బేసిన్‌లో 444, కృష్ణాబేసిన్‌లో 188 చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 625 పనులకు టెండర్లు పిలవగా, 560 టెండర్లు ఖరారు చేశారు. జిల్లా మంత్రుల దగ్గరే టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్లను ఒక్కటి చేసే బాధ్యత వారే తీసుకున్నారు. కొన్నిచోట్ల గిఫ్ట్​ సెటిల్మెంట్​ చేయగా, మరికొన్నిచోట్ల నేరుగా బెదిరింపులకు దిగారు. ఇందులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకే నది లేదా వాగుపై ఉండే మూడు, నాలుగు చెక్‌డ్యామ్‌లను కలిపి ఒక క్లస్టర్‌గా విభజించారు.

ముందుగా చర్చించుకుని

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రూ. 854 కోట్లతో 114 చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలిచారు. గోదావరి ఉపనది మానేరుపై 29, మూలవాగుపై 12 చెక్‌డ్యామ్‌లు ప్రతిపాదించారు. వీటన్నింటినీ ఒక క్లస్టర్‌గా చేసి ఒకే టెండర్‌ పిలిచారు. 57 పనులకు 18 క్లస్టర్ల కింద టెండర్లు పిలువగా, అత్యధికంగా మానేరు బ్రిడ్జికి సమీపంలో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.75.48 కోట్లతో 2.34 శాతం ఎక్సెస్‌తో జిల్లా నేత దగ్గరి బంధువుకు పనులు దక్కాయి. కరీంనగర్‌ మండలం ఇరుకుల్లవాగుపై 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ. 15.40 కోట్లతో టెండర్లు పిలవగా, ఇక్కడ సైతం 4.50 శాతం ఎక్సెస్‌తో టెండర్‌ దక్కించుకున్నారు.

ఇంత పెద్ద ఎత్తున టెండర్లు పిలిచినా, రెండు సంస్థలే కోట్​ చేయడం చూస్తే సిండికేట్​ వ్యవహారం ఎంత పక్కాగా చేశారో తెలిసిపోతోంది. మానకొండూర్‌ పరిధిలో రూ. 38.45 కోట్ల విలువైన పనులను 2.69శాతం, జమ్మికుంట మండలంలో రూ.60.73 కోట్ల పనులకు 2.88 శాతం అధికంగా టెండర్‌ వేసి బినామీ సంస్థలు దక్కించుకున్నాయి. మంథని మండలం మానేరు వాగుపై మరో 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ. 42.38 కోట్ల టెండర్లలో కూడా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు రెండు సంస్థలే టెండర్లు వేశాయి. దీంతో 3.78 శాతం ఎక్సెస్‌తో స్థానిక నేత చెప్పిన ఏజెన్సీకే టెండర్‌ ఖరారైంది.

నేతల అండతోనే

ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కీలక నేతలకు వాటాలున్న కంపెనీలకు చెక్​డ్యాం టెండర్లు ఎక్సెస్​తో దక్కాయి. క్లస్టర్లవారీగా వరంగల్‌ జిల్లాకు ఓ ఎమ్మెల్యే సంస్థకు రూ. 60 కోట్లు, కరీంనగర్‌ జిల్లా కీలక నేత బంధువు ఏజెన్సీకి రూ. 70 కోట్లు, మరో ఎమ్మెల్యేకు సంబంధించిన మరో ఏజెన్సీకి రూ.75 కోట్లు, వరంగల్​ జిల్లాకు చెందిన మంత్రి బంధువుకు చెందిన సంస్థకు రూ.75 కోట్ల పనులు దక్కాయి. నల్లగొండ జిల్లాలోనూ వరంగల్, కరీంనగర్‌కు చెందిన కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే నిర్మాణ సంస్థకు రూ.100 కోట్ల విలువైన పనులను 4 శాతానికి మించి ఎక్సెస్‌కు ఇప్పించుకున్నారు.

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో మరింత బరి తెగించారు. 71 చెక్‌డ్యామ్‌ పనులకు రూ.250 కోట్లతో టెండర్లు పిలవగా, నాలుగు ఏజెన్సీలకే పనులు పంచేశారు. ఓ మంత్రి సమక్షంలో వీటిని ఖరారు చేసుకున్నారు. సంస్థలు ముందుగానే కమీషన్లు, పర్సెంటేజీలు వేసుకుని ఎక్సెస్​కు కోట్​ చేసి పనులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రికి కూడా ఆశించినంతగా ముట్టచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాల్లో రెండు సంస్థలకు 3.99 శాతం ఎక్సెస్‌తో, మరో రూ. 35 కోట్లతో 16 పనులను ఒకే క్లస్టర్‌ కింద టెండర్లు పిలిస్తే 4.59 శాతం ఎక్సెస్‌తో ఇంకో సంస్థకు అప్పగించారు.

పంచుకున్నారిలా!!
  • కరీంనగర్ జిల్లా​కు చెందిన ఓ మంత్రి కంపెనీ రూ. 380 కోట్లు
  • వరంగల్​ జిల్లాకు చెందిన ఓ మంత్రి బినామీ కంపెనీ రూ. 102 కోట్లు
  • నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఓ మంత్రి బినామీ కంపెనీ రూ. 254 కోట్లు
  • వరంగల్​, నల్గొండ ఎమ్మెల్యేల కంపెనీలకు రూ. 100 కోట్లు

Next Story