- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికసిత్ భారత్ నిర్మాణంలో యువ నాయకత్వమే కీలకం: ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది.

దిశ, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని నితిన్ నబీన్‌ను సత్కరించారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యువతకు స్ఫూర్తిగా నితిన్ నబీన్ నాయకత్వం వచ్చే 25 ఏళ్లు దేశ చరిత్రలో అత్యంత కీలకమని, వికసిత భారత నిర్మాణ లక్ష్యం నెరవేరడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ కీలక సమయంలో బీజేపీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నితిన్ నబీన్ వంటి యువ నేతల పాత్ర అమోఘమని ఆయన ప్రశంసించారు. నితిన్ నబీన్‌ను నేటి తరం 'మిలీనియల్' నాయకుడిగా అభివర్ణిస్తూ, రేడియో కాలం నాటి జ్ఞాపకాలను, నేటి ఏఐ (AI) సాంకేతికతను మేళవించగల అనుభవం ఆయనకు ఉందని, ఇది పార్టీ కార్యకర్తలకు గొప్ప బలాన్నిస్తుందని మోదీ పేర్కొన్నారు.
సేవా యజ్ఞమే బీజేపీ అసలైన సంస్కృతి
బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక సంస్కృతి, భావోద్వేగాలతో కూడిన కుటుంబమని ప్రధాని అన్నారు. పదవుల కంటే సంప్రదాయాలకు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా సేవకే తమ పార్టీ అగ్రపీఠం వేస్తుందని స్పష్టం చేశారు. అధికారాన్ని భోగంగా కాకుండా, సేవకు మార్గంగా మార్చుకున్నందునే గత 11 ఏళ్లలో హర్యానా, అస్సాం, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయాలు సాధించిందని, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో ప్రజల బలమైన గొంతుకగా ఎదిగిందని ఆయన వివరించారు.
స్థానిక సంస్థల్లో విజయం.. కేరళ పై గురి
దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ లక్ష్యాలతో జోడిస్తూ బీజేపీ ముందుకు సాగుతుందని మోడీ తెలిపారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో 25 ప్రధాన నగరాలను కైవసం చేసుకోవడం, 50 శాతం కౌన్సిలర్ సీట్లు సాధించడం పార్టీ ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా కేరళ రాజధాని తిరువనంతపురం లో 45 ఏళ్ల లెఫ్ట్ పాలనకు ప్రజలు స్వస్తి పలికి బీజేపీని ఎన్నుకున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేరళ ప్రజలు తమకు కచ్చితంగా అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయం
గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన సామాన్యుల కష్టాలను తీర్చడమే బీజేపీ నమూనా అని ప్రధాని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 12 కోట్లకు పైగా కుటుంబాలకు పైపు నీరు అందించడం, ఉజ్వల పథకం ద్వారా మహిళలకు పొగ నుండి విముక్తి కలిగించడం వంటివి కేవలం బీజేపీ సున్నితత్వం వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. ఓట్ల కోసం కాకుండా దేశాభివృద్ధి కోసం ఈశాన్య రాష్ట్రాలను 'దిల్ - ఢిల్లీ' కి దగ్గర చేశామని, 'లఖ్ పతి దీదీ' వంటి పథకాలతో సోదరీమణుల కలలను సాకారం చేస్తున్నామని ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.






