మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకుడి హల్‌చల్.. భయాందోళనకు గురైన వాహనదారులు

by Jakkula.Mamatha |

మద్యం మత్తులో ఒక యువకుడు రోడ్డు పై సృష్టించిన బీభత్సం స్థానికులను, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకుడి హల్‌చల్.. భయాందోళనకు గురైన వాహనదారులు
X

దిశ,​బూర్గంపాడు: మద్యం మత్తులో ఒక యువకుడు రోడ్డు పై సృష్టించిన బీభత్సం స్థానికులను, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని వసుంధర అంజలి పెట్రోల్ బంక్ ఎదురుగా సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.​ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు మితిమీరిన మద్యం సేవించి, చేతిలో బీరు సీసా, కర్ర పట్టుకుని ప్రధాన రహదారి పైకి వచ్చాడు. మద్యం మత్తులో పూర్తిగా ఊగిపోతూ రోడ్డుపైనే పడుకుని, వెళ్లే వాహనాలను అడ్డుకుంటూ హల్చల్ చేశాడు. సుమారు గంటకు పైగా సదరు యువకుడు అక్కడి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేయడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పోలీసులను ఎదిరించిన వైనం..

​యువకుడి ప్రవర్తన మితిమీరడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారి సదరు యువకుడిని శాంతింపజేసేందుకు, రోడ్డుపై నుంచి పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు పోలీసుల మాటను కూడా ఖాతరు చేయకుండా వారిపైకే ఎదురుతిరిగాడు. పోలీస్ అధికారి ఎంత అదుపు చేసిన ఆ యువకుడు అదుపులోకి రాకపోవడంతో, చివరకు స్థానికులు చొరవ తీసుకున్నారు. అక్కడున్న వారంతా ఒక్కటై సదరు యువకుడిని చుట్టుముట్టి, గట్టిగా పట్టుకుని బంధించారు. ​అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఘటనతో సారపాక పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం వాతావరణం నెలకొంది.

Next Story