నవతరం మహిళ శిల్పం కాదు శిల్పి.. మార్పుకు అడ్డొస్తున్న మగతనం

by Dishafeatures2 |
నవతరం మహిళ శిల్పం కాదు శిల్పి.. మార్పుకు అడ్డొస్తున్న మగతనం
X

దిశ, ఫీచర్స్ : మగతోడు లేకుంటే మగువలకు మనుగడే లేదన్న స్థితి నుంచి ఒంటరిగా ఎదుగుతున్న క్రమం.. అణచివేతను ధిక్కరించి, పితృస్వామ్య విధానాలను ఎండగడుతున్న తీరు.. పురుషాధిక్య సమాజ గోడల్ని బద్దలుకొడుతోంది. తల్లి, చెల్లి, భార్య.. ఇలా లెక్కకు మించిన పాత్రల్లో శతాబ్దాలుగా జీతంలేని ఉద్యోగాలు నెట్టుకొచ్చిన స్త్రీమూర్తులు ఇప్పుడు జీతాలిచ్చే స్థాయిని అందుకుంటున్నారు. అయితే ఈ మారిన పద్ధతులు మహిళల్లో ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంచాయే గానీ ఎమోషనల్ ఇండిపెండెన్స్‌ను ఇవ్వట్లేదు. ఉద్యోగం చేసే స్వేచ్ఛను కల్పించాయే గానీ ఊడిగం నుంచి తప్పించట్లేదు. న్యూ జనరేషన్ కపుల్స్‌లో సమానత్వపు భావనలు వికసిస్తున్నా.. సంప్రదాయ సమాజపు ఆలోచనలు, మగతనపు సవాళ్లు వాటిని ఆదిలోనే తుంచేస్తున్నాయి. పని ప్రదేశాల్లో మహిళా శక్తిని కొలుస్తున్నా.. సొంత గూటిలో పాత కుంపటే రగులుతోంది. మగతనపు మాయలో చెలరేగే అశాంతి.. జంటల మధ్య కలహాలకు దారితీసి కాపురాలు కూలుస్తోంది. ఆ మంటలను ఆర్పేసి, పురుషుల మస్తిష్కాలను కొత్తగా ఆవిష్కరిస్తున్న నవతరం మహిళపై 'దిశ' స్పెషల్ స్టోరీ..

ఎమోషనల్ ఇండిపెండెన్స్..

యంగ్ మిలీనియల్స్‌లో లింగ వివక్ష ప్రభావం తక్కువే. హైయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ స్కిల్స్‌తో మహిళలు ప్రపంచ యవనికపై సత్తా చాటుతున్నారు. కోరుకున్న జాబ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డెసిషన్ మేకింగ్‌ ఎబిలిటీ ఉన్నప్పటికీ భావోద్వేగపరంగా స్వాతంత్ర్యాన్ని అనుభవించట్లేదు. భర్త, కుటుంబం, కల్చర్, సంప్రదాయాల విషయంలో బందీలు అవుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. కట్టు, బొట్టు, నడక, నడవడిక ఎలా ఉండాలో? ఆమె చేతుల్లో ఉండట్లేదు. ఆఫీసులో అధికారం చెలాయించినా.. పర్సనల్ లైఫ్‌లో ప్రతీ పనికి పరిమితులు, సొంత నిర్ణయాలకు అడ్డంకులు, ఆంక్షలు, సమాధానాలు, సంజాయిషీల రూపంలో నిస్సహాయతను గుర్తుచేస్తున్నాయి. సెల్ఫ్ ఐడెంటిటీని నిరాకరిస్తూ ఎమోషనల్ ఇండిపెండెన్స్‌ను అందని ద్రాక్షగా మారుస్తున్నాయి.

సంకట స్థితిలో నవతరం భర్తలు..

నిజానికి నవతరం భర్తల్లో చాలామంది తమ భాగస్వాముల శక్తి సామర్థ్యాలను గౌరవిస్తున్నారు. పెరిగిన పరిస్థితులు, చదివిన చదువు, అలవరుచుకున్న విజ్ఞానం వారిని సమానత్వం దిశగా నడిపిస్తున్నాయి. వైఫ్/గర్ల్ ఫ్రెండ్ ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తూ.. వాళ్లు సాధించిన విజయాలను నిండు మనసుతో ఆహ్వానిస్తున్నారు. ఈ విషయంలో ఐకానిక్ పర్సనాలిటీగా ఉండాలనుకుంటున్నారు. కానీ సొసైటీలో అనాదిగా కొనసాగుతున్న పారామీటర్స్.. పురుషుల మగతనాన్ని పదే పదే గుర్తుచేస్తున్నాయి. పురుషాధిక్యతను ప్రదర్శించాలనే వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబం, స్నేహితులు కూడా ఇదే పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు. ఇవి పాటించని వారిని మగతనం లేని వారిగా చిత్రీకరిస్తూ మార్పుకు మంగళం పాడేస్తున్నారు. దీంతో సంకట స్థితిలో చిక్కుకున్న పురుషులు.. ఆందోళనకు గురై, ఆవేదన అనుభవించి అర్ధాంగులకు అశాంతి మిగులుస్తున్నారు. వయలెన్స్ పెరిగి విడాకుల వరకు వెళ్తున్నారు.

మల్టీ ఫేస్ మాయగాళ్లు..

ఈ రకం పురుషులు పని ప్రదేశాల్లో తోటి మహిళల పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తారు. వారి నైపుణ్యాలను తెగ పొగిడేస్తూ ఉమెన్ ఎంపవర్‌మెంట్, ఈక్వాలిటీ మీద లెక్చర్స్ దంచేస్తారు. మొత్తం మీద స్త్రీ జనోద్ధరణకు కంకణం కట్టుకున్న నవయుగ పురుషుల వలె సెల్ఫ్ ఇమేజ్ సృష్టించుకుని కీర్తించబడతారు. కానీ అదంతా ఆఫీస్ గడప దాటే వరకే. ఇంటికెళ్లాక సగటు పురుష భావజాలమే బయటికొస్తుంది. ఇంటి యజమాని దర్పాన్ని ఒలకబోస్తూ భార్య తను చెప్పిందే వినాలనుకుంటాడు. నిర్ణయాత్మక పాత్ర తనదే ఉండాలని తపిస్తాడు. ఇక మరొక సందర్భంలో.. ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులకు దూరంగా నివసిస్తున్న జంటల్లో మరో కోణం దాగుంది. భార్యాభర్తలు వర్క్ షేర్ చేసుకుంటూ అన్యోన్యంగా కలిసున్నా.. సొంతూరుకు వెళ్తే మాత్రం ఆ భర్తకు మగతనం గుర్తుకొస్తుంది. పేరెంట్స్ ముందు పాత కల్చర్‌ మైగ్రేట్ అయిపోయి భార్యపై పెత్తనాన్ని ప్రదర్శిస్తాడు.

యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్

ఈ తరంలో అబ్బాయిలు, అమ్మాయిల్లో మీటింగ్స్, హగ్గింగ్స్, హ్యాంగవుట్స్ కామన్. కానీ క్లాస్ రూమ్‌కు వచ్చేసరికి రెండు జెండర్స్ మధ్య తెలియని విభజన రేఖ కనిపిస్తుంది. గర్ల్స్ ఒకవైపు, బాయ్స్ మరోవైపు కూర్చుంటారు. ఎవరైనా అమ్మాయి అబ్బాయిల గ్రూప్‌ వైపుగా వచ్చిందంటే చాలు.. నెగెటివ్ కామెంట్స్‌కు బలి అవ్వాల్సిందే. అది ఇంటెన్షనల్లీ కాకపోయినా.. సొసైటీలో కొనసాగుతున్న పద్ధతులు, పరిమితులే అందుకు కారణం. ఈ క్రమంలో అబ్బాయిలు ఎవరూ సదరు అమ్మాయి పక్షాన నిలబడరు. అందుకే స్త్రీలకు లింగ వివక్ష నుంచి విముక్తి కలిగించడమంటే కొత్త వాతావరణాన్ని సృష్టించడం కాదు.. అపోజిట్ జెండర్‌పై ఆలోచనా తీరును మార్చడం. ఇలాంటి భావనలు, సొసైటీ పరిమితుల నడుమ మహిళలకు సమానత్వాన్ని, స్వాతంత్య్రాన్ని కల్పించడం అసాధ్యమే. అయితే పురుషులు మారకుండా స్త్రీలను ఉద్ధరించలేం. అలాగే వారి సమస్యలను అర్థం చేసుకోగలిగితే తప్ప పురుషులు మారరు. అందుకే మహిళలకు కావాల్సింది రక్షకులు కాదు.. మంచి భాగస్వాములు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed