అడవిలో ట్రెక్కింగ్.. నాలుగు రోజులుగా తప్పిపోయిన యువతి

by Muthe.Rajitha |

కేరళకు చెందిన ఐటీ ఉద్యోగిని శరణ్య నాలుగు రోజులుగా అడవిలో తప్పిపోయిన కథ సుఖాంతమైంది.

అడవిలో ట్రెక్కింగ్.. నాలుగు రోజులుగా తప్పిపోయిన యువతి
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళకు చెందిన ఐటీ ఉద్యోగిని శరణ్య నాలుగు రోజులుగా అడవిలో తప్పిపోయిన కథ సుఖాంతమైంది. కర్ణాటకలోని కొడగు (Coorg) అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి తప్పిపోయిన శరణ్య, నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం సాయంత్రం క్షేమంగా దొరికింది. కోజికోడ్‌కు చెందిన శరణ్య.. ఏప్రిల్ 2న తన బృందంతో కలిసి కర్ణాటకలోనే అత్యంత ఎత్తైన తడియండమోల్ (Tadiandamol) శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి, దారి తప్పి దట్టమైన అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయింది. ఆమె ఆచూకీ కోసం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడంతో, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది.

ఈ గాలింపు చర్యల కోసం కర్ణాటక ప్రభుత్వం దాదాపు 100 మందికి పైగా బలగాలను రంగంలోకి దించింది. అటవీ శాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు, స్నిఫర్ డాగ్స్, యాంటీ-నక్సల్ ఫోర్స్ (ANF) సభ్యులు డ్రోన్స్ సహాయంతో అడవిని జల్లెడ పట్టారు. అత్యాధునిక డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి గాలిస్తుండగా.. ఆదివారం సాయంత్రం తడియండమోల్ సమీపంలోని పాడండమలై అటవీ ప్రాంతంలో ఆమె ఆచూకీ లభించింది. ఆహారం లేకపోయినా, కేవలం నీటిని తాగుతూ అత్యంత ధైర్యంగా ప్రాణాలను కాపాడుకున్న శరణ్య మనోధైర్యాన్ని అధికారులు అభినందించారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ, ఆమెను వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం మడికేరి మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాథమిక చికిత్స అనంతరం కేరళలోని తన స్వగ్రామానికి పంపించనున్నట్లు వెల్లడించారు.

Next Story