తెలంగాణలో హత్య చేసి.. మహారాష్ట్రలో పూడ్చిపెట్టి..

by Muthe.Rajitha |

తెలంగాణలో ఓ మహిళను హత్య చేసి మహారాష్ట్రలో పూడ్చి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలో హత్య చేసి.. మహారాష్ట్రలో పూడ్చిపెట్టి..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఓ మహిళను హత్య చేసి మహారాష్ట్రలో పూడ్చి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్‌ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పిట్టలవాడలో ఒంటరిగా ఉంటున్న జబీన్‌కు పరిచయం ఉన్న ఇంద్రవెల్లికి చెందిన ఫారూఖ్‌ఖాన్‌కు ఆమె తన నగలను తాకట్టు పెట్టి మరీ డబ్బు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో ఫారూఖ్‌ ఇవ్వకుండా తప్పించుకున్నాడు. గత ఏడాది నవంబరు 25 నుంచి జబీన్‌ కనిపించకపోవడంతో ఆమె సోదరి మావల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 11న ఆమె సోదరి మరో ఫిర్యాదు చేస్తూ తమ మేనమామ కుమారుడు మహ్మద్‌ తాహెర్‌ వద్ద జబీన్‌ వ్యక్తిగత ఫొటోలు ఉన్నాయంటూ, వాటితో బ్లాక్‌మెయిల్‌ చేశాడని, ఫారూఖ్‌ఖాన్‌తో పాటు అతనిపైనా అనుమానం ఉందని పేర్కొన్నారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫారూఖ్‌ఖాన్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. జబీన్‌ను పిట్టలవాడలోనే హత్య చేసి, అనంతరం కారులో మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలూకా సార్ఖని సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న వంతెన కింద శవాన్ని పూడ్చిపెట్టినట్లు వెల్లడించారు. కాగా బుధవారం పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవాన్ని వెలికి తీసి, హత్యను నిర్దారించి విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story