- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు
ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అధికారుల బాధ్యతారాహిత్యానికి ఆ భవనమే మౌన సాక్ష్యం.

దిశ, డోర్నకల్ : ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అధికారుల బాధ్యతారాహిత్యానికి ఆ భవనమే మౌన సాక్ష్యం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద బాలికలకు అండగా ఉంటుందనుకున్న వసతి గృహం.. నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. రూపాయి రూపాయి కలిపి పేద ప్రజల సొమ్ము రూ.1.25 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం, కనీసం ఒక్క విద్యార్థినికీ కూడా నీడను ఇవ్వలేకపోయింది. ప్రారంభోత్సవం జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. నేటికీ ఆ హాస్టల్ తలుపులు తెరుచుకోకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చిలుకోడు ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో నిర్మించిన బాలికల వసతి గృహ నిర్మాణానికి 2015లో నాటి ఎమ్మెల్యే రెడ్యానాయక్ రూ.1.25 కోట్ల భారీ వ్యయంతో పునాది రాయి వేశారు. నిధులు మంజూరు కావడంతో గుత్తేదారుడు కూడా పనులను శరవేగంగా పూర్తి చేసి, భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 2019లో అదే ఎమ్మెల్యే చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం కూడా జరిపించారు. బోర్డులు పెట్టారు.. రిబ్బన్లు కట్ చేశారు.. కానీ, ఆ సంబరం అంతటితోనే ముగిసిపోయింది.
ఏడేళ్లుగా అంధకారంలోనే..
భవనం నిర్మించి, రంగులు వేసి, ప్రారంభోత్సవం చేసి ఏడేళ్లు గడుస్తున్నా విద్యార్థినులు మాత్రం అందులోకి అడుగుపెట్టలేదు. ఇంత పెద్ద భవనాన్ని వదిలేయడానికి అధికారులు చెబుతున్న కారణాలు వింటే సామాన్యుడికి సైతం ఆగ్రహం రాక మానదు. రూ.1.25 కోట్లు ఖర్చు పెట్టి భవనం కట్టిన యంత్రాంగం.. దానికి కనీస అవసరాలైన నీటి వసతి, విద్యుత్ కనెక్షన్ సౌకర్యం లేదనే సాకుతో ఏడేళ్లుగా ఈ భవనాన్ని నిరుపయోగంగా వదిలేశారు. కనీసం ఒక్క రోజు కూడా వినియోగంలోకి రాకుండానే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటోంది. కిటికీల అద్దాలు పగిలిపోతున్నాయి. తలుపులకు చెదలు పడుతున్నాయి. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు మొలిచి పాములకు, తేళ్లకు నిలయంగా మారింది. రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులకు ఇది అడ్డాగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారుల మార్పు తప్ప.. హాస్టల్ భాగ్యం లేదు
ఈ ఏడేళ్ల కాలంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పాలకులు మారారు. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాయి. వినతిపత్రాలు ఇస్తే పరిశీలిస్తామని చెప్పడం తప్ప, ఏ ఒక్క అధికారి కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదు. అధికారుల ఉదాసీనత వల్ల పేద విద్యార్థినులు కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణాలు చేయలేక, ప్రైవేట్ వసతి గృహాల్లో వేలాది రూపాయలు భరించలేక చదువుకు దూరమవుతున్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చొరవ చూపాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని పక్కనబెట్టి, తక్షణమే విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించి బాలికల వసతి గృహాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు కాకముందే అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. మండలంలో బాలికలకు ఒక్క వసతి గృహం లేకపోవడం గమనార్హం.
బోర్డు మాత్రమే 'ఆదర్శం'.. లోపలంతా శూన్యం.. డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్
గత 11 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన జరిపి, 2019లో ప్రారంభోత్సవం సైతం చేశారు. నాటి నుంచి ఆదర్శ బాలికల వసతి గృహం తలుపులు తెరుచుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నీటి వసతి, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాన్ని వాడుకలోకి తేకుండా వదిలేయడం ఎంతవరకు సమంజసం? స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ చొరవ చూపి బాలికల హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. డీఎస్‌ఎఫ్‌ఐ తరఫున క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. జిల్లా వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న హాస్టల్ భవనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.
ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాం.. మండల విద్యాశాఖ అధికారి లక్ష్మ నాయక్
ఆదర్శ బాలికల వసతి గృహాన్ని వాడుకలోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం అనేక ప్రయత్నాలు చేపట్టింది. నీటి వసతి, మురుగు నీటి విడుదల, విద్యుత్ ఏర్పాటు ప్రధాన సమస్యలుగా మిగిలాయి. నీటి వసతికి భూగర్భ జల వనరుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ నీటి లభ్యత లేదని తేల్చారు. విద్యుత్ సరఫరాకు విద్యుత్ నియంత్రిక అవసరం. హాస్టల్ వాడుకలోకి తెస్తే మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేదు. గతంలో జిల్లా అదనపు కలెక్టర్, అధికారులు పరిశీలన జరిపారు. హాస్టల్‌ను ప్రారంభించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం.






