- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి ఉద్యోగుల బినామీ పేర్లు మారేదెన్నడు?
సింగరేణిలో 40 ఏళ్లుగా వీడని 'బినామీ' పేర్ల గోస! పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం 500 మంది కార్మికుల ఎదురుచూపు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందోనని సింగరేణి ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి. సింగరేణి ఎన్నికల ప్రచారం కోసం భూపాలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు పేర్లతో ఉన్న సింగరేణి ఉద్యోగుల పేర్లను మార్పు చేస్తామని, అందుకు తగు విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సింగరేణి ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైతే బినామీ పేర్లతో ఉన్న ఉద్యోగులందరికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆశపడుతున్నారు.
సింగరేణి యాజమాన్యం కార్మికులను భర్తీ చేసేందుకు 1986 నుంచి 1989 వరకు ఎంప్లాయిమెంట్ కార్డు ఉన్న వారందరికీ పరుగు పందెం పెట్టి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎంప్లాయ్మెంట్ కార్డు లేని వారు తమకు దగ్గరగా ఉన్న వారి పేరు మీద పరువు పందెంలో పాల్గొని ఉద్యోగం సాధించారు. అప్పటి నుంచి ఫోటో మాత్రం ఉద్యోగం చేసే వ్యక్తిగా, పేరు వేరే వారి పేరుపై ఉద్యోగం చేయాల్సి వస్తుంది. గత 40 ఏళ్లుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ మార్పు రావడం లేదు. 1980 నుంచి ఉద్యోగం పొందిన వారు వారి వారసులు సైతం అదే పేరుపై ఉద్యోగం చేస్తూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఒకరి పేరుపై తమ ఉద్యోగం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్‌కు విన్నవించినప్పుడు తాము అధికారంలోకి వస్తే పేరు మార్పు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. 2014లో పేరు మార్పు కోసం ప్రభుత్వం ఒక కమిటీ వేసినప్పటికీ అది నామమాత్రంగానే ఉండిపోయింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తాము అధికారంలోకి వస్తే పేరు మార్పు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ నెరవేరలేదు.
సింగరేణి కార్మిక సంఘాల ఎప్పటికప్పుడు యాజమాన్యానికి విన్నవించినా వారి ఆవేదన పెడచెవిన పెడుతున్నారు. సింగరేణి సంస్థలో 500కు పైగా బినామీ పేర్లతో ఉద్యోగాలు చేస్తూ పేరు మార్పు ఎప్పుడు జరుగుతుందని ఎదురుచూస్తున్నట్లు సమాచారం. బినామీ పేర్లతో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ చనిపోయిన వారున్నారు. వారి వారసులు సైతం ప్రస్తుత ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. విషయంపై ప్రభుత్వాలు మానవత్వంతో ఆలోచించి పేరు మార్పు చేసి సింగరేణి కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ష
పేరు మార్పుపై చర్యలు తీసుకోవాలి..
సింగరేణి ఉద్యోగుల పేరు మార్పు విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న కార్మికులకు ప్రభుత్వం చొరవ చూపి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. –భూపాలపల్లి బ్రాంచ్ ఏఐటీయూసీ సెక్రటరీ రమేష్






