- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందేనా?
ప్రభుత్వ స్కూళ్ల రీఓపెన్ వేళ 2వ జత యూనిఫాంపై స్పష్టత కరువు; నాణ్యత లోపంతో దాతల సాయంతో కార్పొరేట్ తరహా దుస్తులిస్తూ కొన్ని స్కూళ్ల ముందడుగు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు రీ ఓపెన్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు రెండు జతల ఉచిత యూనిఫాంలు సకాలంలో అందుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు రెండు జతల దుస్తులు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది కూడా మొదటి విడత యూనిఫామ్ కు సంబంధించిన క్లాత్ సరఫరా కోసం విద్యాశాఖ టెస్కోకు ఆర్డర్లు జారీ చేసింది.
తర్వాత టెస్కో ఆర్డర్లను ప్రభుత్వం రద్దు చేయగా, అప్పటికే పంపిణీ చేసిన క్లాత్ తో అమ్మ ఆదర్శ పాఠశాలల మహిళా సంఘం సభ్యుల చేత కుట్టించి పాఠశాలల రీఓపెన్ నాటికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, రెండో యూనిఫాం విషయంలో మాత్రం స్పష్టత ఇంకా రావడం లేదు. టెండర్లు పిలవడం, క్లాత్ సరఫరా చేయడం వంటివి సకాలంలో పూర్తయితేనే యూనిఫాంలు అనుకున్న సమయానికి అందించడం కష్టమవుతుంది. అలాంటిది టెస్కో టెండర్లు రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు రెండో జత యూనిఫాం ఎప్పుడు అందుతుందనే దానిపై స్పష్టత కరువైంది.
క్వాలిటీ లేదని విమర్శలు..
ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత యూనిఫాంల నాణ్యతపై ప్రతి ఏటా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. క్లాత్ నాణ్యత సరిగా లేకపోవడం, ఒకే రకమైన రంగులు వెలిసిపోవడం, కుట్టు కూలి సరిగా అందక మహిళా సంఘాలు అరకొరగా కుట్టడం వంటి కారణాల వల్ల దుస్తులు విద్యార్థులకు సరిగ్గా సరిపోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో పోలిస్తే, ప్రభుత్వ స్కూళ్ల పిల్లల్లో ఈ నాణ్యత లేని దుస్తులు కొంత ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా కేవలం ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా, పంపిణీ చేసే దుస్తుల నాణ్యతపై ప్రత్యేక నిఘా ఉంచాలని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫాంలను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు.
దాతల సహాయంతో ప్రభుత్వ స్కూళ్ల ముందడుగు..
ఈ నేపథ్యంలో, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ లపైనే ఆధారపడకుండా.. స్వచ్ఛందంగా స్థానిక దాతలు, పూర్వ విద్యార్థుల సహాయాన్ని కోరుతున్నారు. దాతల ఆర్థిక సహాయంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. మంచి క్వాలిటీ గల క్లాత్‌తో టై, బెల్ట్, ఐడీ కార్డులతో కూడిన సరికొత్త డిజైన్ యూనిఫాంలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ రకమైన చొరవ వల్ల అటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






