'SIR' గడువు పెంచుతారా?

by Muthe.Rajitha |

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణ గడువు నేటితో ముగియనుంది.

SIR గడువు పెంచుతారా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. ఓటర్లు తమ వివరాలను నమోదు చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను సంబంధిత బూత్‌ స్థాయి అధికారులకు (BLO's) సమర్పించడానికి మంగళవారమే చివరి రోజు అని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ పత్రాల సమర్పణ అత్యంత కీలకమైనది. అయితే, క్షేత్రస్థాయిలో ఇంకా చాలా మంది ఓటర్లు తమ పత్రాలను సమర్పించాల్సి ఉండటం, అలాగే వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేందుకు మరింత సమయం అవసరం కావడంతో గడువు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్యూమరేషన్‌ పత్రాల స్వీకరణతో పాటు వాటి డిజిటలైజేషన్‌ ప్రక్రియ కోసం మరో 10 రోజుల పాటు గడువును పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్‌యాదవ్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) అత్యవసర లేఖ రాశారు.

సెలవులు, ఇతర కారణాల వల్ల చాలా చోట్ల ప్రక్రియ ఆలస్యమైందని, ఓటర్లకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించడంతో పాటు పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు మరో పది రోజుల అదనపు గడువు ఎంతో అవసరమని సీఈవో తన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నుండి నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటివరకు ఓటర్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ ఎన్యూమరేషన్‌ పత్రాలను ఈరోజే బీఎల్‌వోలకు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story