వాడని డేటా ఎందుకు వృధా కావాలి?: టెలికాం కంపెనీల దోపిడీపై ఎంపీ రాఘవ్ చద్దా గర్జన

by Malleboina Mahesh |

వాడని డేటా అర్ధరాత్రికి రద్దు కావడంపై ఎంపీ రాఘవ్ చద్దా ధ్వజమెత్తారు. 'డేటా రోల్‌ఓవర్' సౌకర్యం కల్పించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

వాడని డేటా ఎందుకు వృధా కావాలి?: టెలికాం కంపెనీల దోపిడీపై ఎంపీ రాఘవ్ చద్దా గర్జన
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (MP Raghav Chadha) లేవనెత్తుతున్న సమస్యలను దేశవ్యాప్తంగా అందరిని ఆలోచింపజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సభలో ఎమ్ మాట్లాడతారని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టెలికాం కంపెనీల దోపిడీపై ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "మనం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్ డేటా, వాడకపోతే అర్ధరాత్రికి ఎందుకు రద్దవుతుందంటూ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (ఎంపీ రాఘవ్ చద్దా) టెలికాం కంపెనీల విధానాలను నిలదీశారు.

టెలికాం సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న 1.5GB, 2GB డైలీ ప్లాన్లలో, వినియోగదారులు ఒకవేళ ఆ రోజు డేటాను పూర్తిగా వాడకపోతే, మిగిలిన డేటా మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ కాకుండా 'ఎక్స్‌పైర్' అవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "మనం 2GB కి డబ్బులు కడతాం.. కానీ 1.5GB మాత్రమే వాడితే, మిగిలిన 0.5GB అర్ధరాత్రికి మాయమైపోతుంది. ఇది పొరపాటున జరుగుతున్నది కాదు. కంపెనీలు కావాలనే చేస్తున్న పాలసీ" అని ఆయన ట్విట్టర్ (X) వేదికగా మండిపడ్డారు.

వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన డేటాను వారు ఎప్పుడైనా వాడుకునేలా 'డేటా రోల్‌ఓవర్' (Data Rollover) సౌకర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. డేటా అనేది వినియోగదారుల ఆస్తి అని, దానిని ఫోర్ఫీట్ (Forfeited) చేసే హక్కు కంపెనీలకు లేదని ఆయన స్పష్టం చేశారు. మనం పెట్రోల్ కొట్టించుకుంటే అది వాడనంత కాలం ట్యాంకులోనే ఎలా ఉంటుందో, డేటా కూడా అలాగే ఉండాలని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) ఈ విషయంలో జోక్యం చేసుకుని, వినియోగదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సాధారణ వినియోగదారుల నుండి భారీ మద్దతు పొందుతోంది.

Next Story