- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడా మైదానాలపై పట్టింపేది..?
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారిలో ఉన్న క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

దిశ, మంచిర్యాల: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారిలో ఉన్న క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పంచాయతీ తీర్మానంతో ఆయా గ్రామాలలో రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా వాగులు, బండ రాళ్ళల్లో, ఊరికి దూరంగా మైదానాల కోసం స్థలాలను గుర్తించారు. కొన్నిచోట్ల గ్రామానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో తూతు మంత్రంగా బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ హామీ పథకం నిధులతో గుర్తించిన స్థలాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు క్రీడ ప్రాంగణాల కొరకు నిధులు ఖర్చు చేశారు.
ఈ మైదానాలలో కబడ్డీ, ఖో ఖో, హై జంప్, షటిల్ తదితర క్రీడలను ఆ పంచాయతీ పరిధిలోని విద్యార్థులు యువకులు క్రీడలు ఆడుకోవచ్చు, కానీ యువత వీటిని వినియోగించడం లేదు. కారణం ఊరికి పొలిమేరన ఈ క్రీడా ప్రాంగణాలు ఉండడంతో యువకులు, విద్యార్థులు ఆటలు ఆడేందుకు వీలు లేకుండా తయారయ్యాయి. దీంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు ఎంతగానో హడావిడి చేసిన అధికారులు వాటి నిర్వహణను గాలిలో వదిలేశారు. దీంతో ప్రభుత్వం క్రీడా మైదానాలకు కేటాయించిన ప్రజాధనం వృధాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం రూ.కోట్ల రూపాయలు ఖర్చు చేసిన క్రీడా ప్రాంగణాలు యువతకు ఆటలకు పనికిరాకుండా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంగణాలలో క్రీడా పరికరాలు దొంగల పాలు అవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18 మండలాలలో 306 గ్రామపంచాయతీలలో 344 క్రీడ ప్రాంగణాలు మంజూరయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులతో ఆయా గ్రామాలలో క్రీడ ప్రాంగణాల ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి రూ.50 వేల నుంచి రూ.1.30 వరకు ఖర్చు చేశారు. పరికరాలు బిగించి వదిలేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన గాలికి వదిలేయడంతో గ్రామాల్లో బోర్డులు లేకుండా బోసిపోయి కనిపిస్తున్నాయి. మరికొన్ని ఖాళీ స్థలాలతో క్రీడ ప్రాంగణాలు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏడాది మండలాలలో చేపట్టిన పనులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపే సామాజిక తనిఖీ బృందాలు ప్రజా వేదికలో వెల్లడించిన వివరాలు సైతం జిల్లా అధికారులను ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భాలు లేకపోలేదు. క్రీడ ప్రాంగణాల విషయంలో అధికారులు చేసిన పొరపాట్లతో కేవలం అవి బిల్లులు పొందేందుకే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ. కోట్ల ప్రజాధనం దుర్వినియోగం..
జిల్లాలోని 18 మండలాలలో ఈ క్రీడా ప్రాంగణాల విషయాన్ని అధికారులు గాలికొదిలేసారని విమర్శలు ఉండగా. ప్రభుత్వ లక్ష్యానికి అనుకూలంగా ఏర్పాటు చేయాల్సిన క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో అందిన కాడికి అనే విధంగా సిబ్బంది పనితీరు ఇందుకు అద్దం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు గుర్తించిన ఆట స్థలాలు కొన్నిచోట్ల ఎలాంటి పరికరాలు లేకుండానే కనిపిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల బిల్లుల మంజూరులో కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో రూ. కోట్లల్లో ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పర్యవేక్షణ లేకపోవడంతో క్రీడా ప్రాంగణాలు యువతకు ఆటలకు ఆమడ దూరంగా అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వాగులలో, కొన్నిచోట్ల గుట్టల పక్కన, ఊరికి మూడు కిలోమీటర్ల మేర అలంకార ప్రాయంగా కనిపిస్తున్నాయి. అధికారులు ఇచ్చిన టార్గెట్లకు అనుగుణంగా రాజకీయ నాయకుల ఒత్తిడికి ఊరిలో ఎక్కడ ఉన్న స్థలాలను చూపి బోర్డులు ఏర్పాటు చేశారు.
క్రీడా పరికరాలు దొంగలపాలు..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడ ప్రాంగణాలలో రికార్డు పరంగా ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ప్రాంగణాల్లో పరికరాల పై దృష్టి సారించకపోవడంతో అవి కనబడకుండా పోయాయి. అవి ఇప్పుడు దొంగల పాలు అవు తున్నాయి. కొన్నిచోట్ల స్థలాలు కనుమరుగు కాగా మరికొన్నిచోట్ల ముళ్ళ పొదలతో దర్శనమిస్తున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంగణాల పరిస్థితి దేవుడెరుగు అనే చందంగా తయారయింది. ప్రస్తుత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించలేదని తెలుస్తున్న వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని గ్రామీణ ప్రాంత యువత, విద్యార్థులు కోరుతున్నారు.






