- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగలను పట్టుకునేదెప్పుడు..?!
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగైదు నెలలుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.

దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగైదు నెలలుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. పలు ఇళ్లలో చోరీలు, దారి దోపిడీలు, రోడ్డు పై వెంబడించి నగదు విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ దొంగలను పట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదని సంబంధిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2న ఎల్గోయి గ్రామానికి చెందిన కొత్తూరు సంగన్న కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి దైవ దర్శనం నిమిత్తం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు చేరబడి 5 తులాల బంగారం, రెండు లక్షల నగదు దోచుకెళ్ళారు. అదే గ్రామానికి చెందిన చాకలి రాజమ్మ ఇంట్లో రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన బోయిని నికిత కుటుంబ సభ్యులు ఘనగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న అరతులం బంగారం, రూ.10 వేలు, వెండి గొలుసులను దొంగలు దొంగిలించారు.
మే 25న అదే గ్రామానికి చెందిన వృద్ధ మహిళలు గొల్ల నరసమ్మకు చెందిన తులం బంగారం, కాళ్లకు ఉన్న ఇరవై తులాల వెండి కడియాలు దారి దోపిడీ చేశారు. ఇదే విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే విధంగా దాదాపు 20 రోజుల క్రితం కృష్ణాపూర్ చౌరస్తా వద్ద జహీరాబాద్ నుంచి వస్తున్న కుప్పానగర్ గ్రామానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ విధులను ముగించుకొని ద్విచక్ర వాహనం పై గ్రామానికి వస్తున్న క్రమంలో దొంగలు అడ్డగించి సెల్ ఫోన్ తో పాటు కొంత నగదు దోచుకున్నారు. దాంతోపాటు ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ పే నంబర్ చెప్పాలని కత్తితో బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు. జీర్లపల్లి గ్రామానికి చెందిన మొల్ల మాముద్ అనే వ్యక్తి ఇంట్లో నగదు చోరీకి గురైంది. ఝరాసంగం మండల కేంద్రంలో ఈ నెల 10న వంశిరాజ్ అంజన్న అనే వ్యక్తి ఇంట్లో 15 మేకలు దొంగతనానికి గురయ్యాయి. ఆయా గ్రామాల్లో కరెంటు వైర్లు, స్టార్టర్లు సైతం దొంగతనాలు అవుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ రికవరీ మాత్రం కనిపించడం లేదని ఆయా గ్రామానికి చెందిన ప్రజలు, బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం పై జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ను" దిశ "వివరణ కోరగా... కొన్ని కేసులు చేదించామని మరికొన్ని కేసులు త్వరలోనే చేదించి దొంగలను పట్టుకుంటామని వివరణ ఇచ్చారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.






