అల్లూరి సెంటర్‌కు మళ్లీ అల్లూరి ఎప్పుడు..?

by Batti.Sumithra |

పాల్వంచ పట్టణంలోని అల్లూరి సెంటర్ ఒకప్పుడు కేవలం ఒక కూడలి మాత్రమే కాదు.

అల్లూరి సెంటర్‌కు మళ్లీ అల్లూరి ఎప్పుడు..?
X

దిశ, పాల్వంచ టౌన్ : పాల్వంచ పట్టణంలోని అల్లూరి సెంటర్ ఒకప్పుడు కేవలం ఒక కూడలి మాత్రమే కాదు. స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించి, గిరిజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని ప్రతిబింబించే చారిత్రక ప్రదేశంగా నిలిచేది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని చూసిన యువతలో దేశభక్తి, పెద్దల్లో గౌరవభావం కలిగేది. అయితే రోడ్డు విస్తరణ పనుల పేరుతో విగ్రహాన్ని తొలగించిన తర్వాత ఆ ప్రాంతం తన ప్రత్యేక గుర్తింపును కోల్పోయిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని, అలాగే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)కు వెళ్లే ప్రధాన మార్గంలోనే అల్లూరి సెంటర్ ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, పర్యాటకులు, ఉద్యోగులు ఈ కూడలి గుండా ప్రయాణిస్తుంటారు.

ఒకప్పుడు అల్లూరి విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ కేంద్రం ప్రస్తుతం వెలవెలబోతూ కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ అవసరమైతే విగ్రహాన్ని తాత్కాలికంగా తొలగించడం తప్పు కాదని ప్రజలు చెబుతున్నారు. అయితే తొలగించిన విగ్రహాన్ని గౌరవప్రదంగా తిరిగి ప్రతిష్ఠించడం కూడా అంతే ముఖ్యమని గుర్తుచేస్తున్నారు. విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు పునఃప్రతిష్ఠిస్తారు? అనే అంశాలపై ఇప్పటివరకు సంబంధిత అధికారులు లేదా ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. అల్లూరి సెంటర్‌లో విగ్రహం ఉన్న రోజుల్లో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. పాల్వంచకు వచ్చిన వారు ఆ కూడలిని "అల్లూరి సెంటర్"గానే గుర్తించేవారు.

ప్రస్తుతం అక్కడ అల్లూరి విగ్రహం లేకపోవడంతో ఆ కూడలి తన చారిత్రక గుర్తింపును కోల్పోయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒక పట్టణ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వారు పేర్కొంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన సమయంలో వారి జ్ఞాపక చిహ్నాలే కనుమరుగవుతుండటం బాధాకరమని సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అదే ప్రాంతంలో లేదా తగిన ప్రదేశంలో గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠ చేసి, అల్లూరి సెంటర్‌కు మునుపటి గుర్తింపును తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story