- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక ధరలకు యూరియా అమ్మకాలు.. రైతు నెత్తిన మరింత భారం
వలిగొండ మండల కేంద్రంతో పాటు నాగారం, నెమిలి కాల్వ, సంగెం తదితర గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు యూరియా విక్రయాలు జరుగుతున్నాయి.

దిశ, వలిగొండ : వలిగొండ మండల కేంద్రంతో పాటు నాగారం, నెమిలి కాల్వ, సంగెం తదితర గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు యూరియా విక్రయాలు జరుగుతున్నాయి. రూ.267లకు విక్రయించాల్సిన ఒక బస్తా యూరియాను రూ.320లకు అమ్ముతున్నారు. యూరియా కొరతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇదే అదనుగా భావిస్తున్నారు. ఒక్కో యూరియా బస్తాపై ఏకంగా రూ.53 అదనంగా వసూలు చేస్తూ రైతుల నెత్తిన మరింత భారం మోపుతున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ లావాదేవీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ తతంగమంతా సంబంధిత అధికారులు గమనిస్తున్నప్పటికీ నోరు మెదపకపోవడం బాధాకరం. ఇప్పటి వరకు జిల్లా అధికారులు గానీ, మండల వ్యవసాయ అధికారి గానీ ఫెర్టిలైజర్ షాపులపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పండించిన ధాన్యం అమ్ముడుపోక నానా తంటాలు పడ్డ రైతులు, అకాల వర్షాల బారిన పడి అరకొర గిట్టుబాటు ధరకు తమ పంటలను విక్రయించుకుని తేరుకునేలోపే ఇప్పుడు యూరియా కష్టాలు మొదలయ్యాయి. కొరత కారణంగా యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడి పడరాని పాట్లు పడుతుండగా, ఫెర్టిలైజర్ షాపుల నిర్వాహకులు మాత్రం దానిని దందాగా మార్చుకుని రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
ప్రభుత్వం ఆన్‌లైన్‌లో యూరియా యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి ఎలాంటి మోసాలకు తావులేకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటే, కొందరు ఫెర్టిలైజర్ వ్యాపారులు దానినే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, మండల యంత్రాంగం కళ్లు తెరిచి అధిక ధరలకు విక్రయిస్తున్న యూరియా అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






