టెక్ మార్కెట్‌లో AI సెగ.. భారీగా పెరగనున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు!

by Kema Shiva Kumar |

AI ప్రభావంతో దేశవ్యాప్తంగా త్వరలోనే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి.

టెక్ మార్కెట్‌లో AI సెగ.. భారీగా పెరగనున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ఆ పేరును ప్రపంచం జపిస్తోంది. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న ఏఐ త్వరలోనే సామాన్య వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టనుంది. ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు (Smart Phones), ల్యాప్‌టాప్‌ (Laptops)లు, టాబ్లెట్లు, ప్లే స్టేషన్ల వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ధరలు త్వరలోనే భారీగా పెరగనున్నట్లు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం AI టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడమేనని చెబుతున్నారు.

మెమొరీ చిప్స్‌ తీవ్ర కొరత..

మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరగడంతో అందుకు అవసరమైన మెమొరీ, స్టోరేజీ చిప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కొరత ఏర్పడింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు తమ లార్జ్ లాంగ్వేజీ మోడల్స్ (LLMs) ట్రైనింగ్ కోసం, అధునాతన కోడింగ్ ఏజెంట్స్ తయారీ కోసం ఈ మెమొరీ చిప్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. చిప్స్ తయారు చేసే ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తిని AI అవసరాల వైపు మళ్లించడంతో, సాధారణ గ్యాడ్జెట్లలో వాడే వినియోగదారులు వాడే గ్రేడ్ చిప్స్ కొరత వేధిస్తోంది. డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో వాటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి.

పెరగనున్న తయారీ ఖర్చులు..

అయితే, లేటెస్ట్ మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలో ఇన్‌బిల్ట్ ఏఐ ఫీచర్లు (In-built AI features) ఇస్తున్నారు. వాటిని రన్ చేయడానికి డివైజ్లలో ఎక్కువ సామర్థ్యం గల ర్యామ్ (RAM), స్టోరేజ్ అవసరం అవుతున్నాయి. చిప్స్ ధరలు పెరగడం, ఎక్కువ మెమొరీ వాడాల్సి రావడం వల్ల కంపెనీలకు గ్యాడ్జెట్ల తయారీ ఖర్చు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ అదనపు భారాన్ని కంపెనీలు వినియోగదారులపైనే వేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు కనీసం ఏకంగా 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు, బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త గ్యాడ్జెట్ల ధరలు పెరగకముందే వినియోగదారులు కొనేందుకు ప్లాన్ చేసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.

Next Story