" ది కేరళ స్టోరీస్" సినిమాల టార్గెట్.. కేరళనా, ఇస్లామా?

by Muthe.Rajitha |

"ది కేరళ స్టోరీ".., దాని సీక్వెల్ సినిమాలు ఎందుకు ప్రమాదకరం అంటే?

 ది కేరళ స్టోరీస్ సినిమాల టార్గెట్.. కేరళనా, ఇస్లామా?
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు. అది సమాజంపై ప్రభావం చూపగల శక్తివంతమైన మాధ్యమం. కొన్ని సినిమాలు సామాజిక అవగాహన పెంచుతాయి, మరికొన్ని చర్చకు దారి తీస్తాయి. అయితే కొన్ని చిత్రాలు సామాజిక-రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లే సాధనాలుగా మారుతాయని విమర్శలు వస్తుంటాయి. 2023లో విడుదలైన "ది కేరళ స్టోరీ" 2026 ఫిబ్రవరి 27న విడుదల కానున్న దాని సీక్వెల్ "ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్" దేశంలో కొత్త వివాదానికి కేంద్రంగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు "లవ్ జిహాద్", బలవంతపు మత మార్పిడి, ISIS రిక్రూట్‌మెంట్ వంటి అత్యంత సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తున్నట్టే కనిపించినా.. ఇవి పూర్తిగా అతిశయోక్తి సినిమాలుగా విమర్శలను ఎదుర్కొంటున్నాయి.

"ది కేరళ స్టోరీ".. విమర్శలు

కేరళ స్టోరీ విడుదలకు ముందు వచ్చిన టీజర్‌లో "32,000 మంది కేరళ మహిళలను బలవంతంగా మత మార్పిడి చేసి ISIS లోకి పంపించారు" అని పేర్కొనడం తీవ్ర వివాదానికి దారితీసింది. తరువాత ఈ సంఖ్యకు ఎటువంటి అధికారిక ఆధారాలు లేవని భారత ప్రభుత్వ డేటా, NIA నివేదికలు, స్వతంత్ర ఫ్యాక్ట్-చెక్ సంస్థలు స్పష్టం చేశాయి. వాస్తవానికి ISISలో చేరిన భారతీయుల సంఖ్య 100–200 మధ్య ఉండగా, కేరళ నుంచి వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వివిధ నివేదికలు సూచించాయి. ఈ విమర్శల నేపథ్యంలో ట్రైలర్ నుంచి ఆ సంఖ్య తొలగించబడినా, అప్పటికే ప్రజల్లో ఒక నిర్దిష్ట అభిప్రాయం ఏర్పడిందని విమర్శకులు పేర్కొన్నారు.

టార్గెట్ కేరళనా..??

కేరళ రాష్ట్రాన్ని కూడా ఈ చిత్రంలో నెగెటివ్ కోణంలో చిత్రీకరించారని విమర్శలు వచ్చాయి. దేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు, మెరుగైన ఆరోగ్య సూచికలతోపాటు, మత సామరస్య రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన కేరళను ఒక ప్రమాదకర ప్రాంతంగా చూపించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడ్డారు. కొన్ని పాత్రలను పూర్తిగా మతోన్మాదులుగా చూపించడం దేశంలో ఇస్లామోఫోబియాను పెంచుతుందని విమర్శించారు.

కడిగిపారేసిన జాతీయ, అంతర్జాతీయ మీడియా

జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ చిత్రంపై విమర్శాణాత్మక రివ్యూలు ఇచ్చాయి. కొన్ని పత్రికలు దీనిని "వాట్సాప్ ఫార్వర్డ్ కథనం"గా అభివర్ణించగా, మరికొన్ని "హేట్ ప్రాపగాండా"గా పేర్కొన్నాయి. సుప్రీం కోర్టు కూడా చిత్రంలో డిస్‌క్లైమర్ స్పష్టంగా ఇవ్వాలని సూచించింది. కథనం ఫిక్షనలైజ్డ్ వెర్షన్ అని తెలియజేయాలని ఆదేశించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చిత్రాన్ని "కమ్యూనల్ పొలరైజేషన్ కోసం రూపొందించిన ప్రాపగాండా"గా విమర్శించారు.

"ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్".. మరిన్ని వివాదాలు

ఇక రెండో భాగం "ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్" విడుదలకు ముందే వివాదాలకు కేంద్రబిందువు అయింది. ఈ రెండో భాగాన్ని కేరళకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించి, అదే విధమైన కమ్యూనల్ విభజన థీమ్‌ను కొనసాగించిందని నేడు విడుదలైన ట్రైలర్ పై విమర్శలు వస్తున్నాయి. కేరళ మంత్రి సాజి చెరియన్ దీనిని మరోసారి "అసత్యాల ఆధారంగా, రాజకీయ ప్రేరణతో రూపొందించిన చిత్రం"గా అభివర్ణించారు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. మొదటి భాగం వల్ల ఏర్పడిన వివాదాలను తగ్గించే ప్రయత్నం కాకుండా, మరింత పెంచేలా సీక్వెల్ రూపొందించబడిందని అంటున్నారు.

ఎందుకు ఈ సినిమాలు ప్రమాదకరం

అయితే ఇలాంటి సినిమాలు ఎందుకు ప్రమాదకరమనే ప్రశ్నకు మూడు ప్రధాన కారణాలు చెప్పవచ్చు. మొదటిది.. ఇవి ఒక నిర్దిష్ట కమ్యూనిటీపై అనుమానం, ద్వేషం పెరిగే అవకాశం కలిగిస్తాయి. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. రెండవది.. "రియల్ స్టోరీ" అనే ప్రచారం ద్వారా ప్రజల్లో భయాన్ని రేకెత్తించి, ఫిక్షన్ - వాస్తవాల మధ్య గీతను మసకబారుస్తాయి. మూడవది.. రాజకీయంగా ఈ చిత్రాలను వాడుకోవడం వల్ల కళాత్మకం కంటే రాజకీయ సాధనాలుగా మారుతున్నాయి. సినిమాకు స్వేచ్ఛ అవసరం. అయితే ఆ స్వేచ్ఛ బాధ్యతతో కూడి ఉండాలి. అసత్యాలు, అతిశయోక్తులు, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే కథనాలు సమాజాన్ని విభజించే, విద్వేషాలు నింపే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా విమర్శాత్మక దృష్టితో పరిశీలించి, ఫ్యాక్ట్స్ ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవడం అత్యంత అవసరం.

Next Story