గురుకుల, ఆశ్రమ పాఠశాలలకు ఏమైంది?

by Ratna Kumari |

ఆసిఫాబాద్ గురుకులాల్లో వరుస ఘటనలు.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

గురుకుల, ఆశ్రమ పాఠశాలలకు ఏమైంది?
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు విద్యార్థుల భద్రత, సంక్షేమంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థుల భద్రతతో పాటు నాణ్యమైన భోజనం అందకపోవడం వంటి సమస్యలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది ఫుడ్ పాయిజన్ ఘటనలతో జిల్లాలోని పలు గురుకులాలు వార్తల్లో నిలవగా, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు వెళ్లిపోవడం, తోటి విద్యార్థుల వేధింపులు, నాణ్యతలేని భోజనంపై నిరసనలు వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

15 రోజుల్లో మూడు ఘటనలు..

జిల్లాలో గడిచిన 15 రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు ఘటనలు విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జూన్ 25న రెబ్బెన మండలంలోని గురుకుల హాస్టల్ నుంచి ఇంటర్ విద్యార్థిని ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయింది. జూలై 5న కెరమెరి మండలం హట్టి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి నాలుగు, ఐదు, ఆరు తరగతుల ముగ్గురు విద్యార్థులు సిబ్బంది దృష్టి మళ్లిన సమయంలో హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. జూలై 4న కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థులే ఓ బాలిక కళ్లకు గంతలు కట్టి బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వరుస ఘటనలతో గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పర్యవేక్షణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాణ్యతలేని భోజనంపై విద్యార్థుల నిరసన ..

కెరమెరి మండలంలోని హట్టి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నాణ్యతలేని భోజనం అందిస్తున్నారని విద్యార్థులు మంగళవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి 10.30 గంటల వరకు భోజనం చేయకుండా ఆహారాన్ని చెత్తబుట్టలో పడేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వండిన అన్నం ముద్దగా మారిందని, పప్పు, ఆలూ కూర పూర్తిగా నీళ్లలా ఉందని, ఉప్పు, కారం లేకుండా ఎలా తినాలని హెడ్‌మాస్టర్‌ను ప్రశ్నించారు. నెల రోజులుగా మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. వారం రోజుల క్రితం ఇడ్లీ తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అప్పట్లో హెడ్‌మాస్టర్‌కు మెమో జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఫోన్‌లో స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఎం

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దిన్‌కార్ మాట్లాడుతూ.. గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని పేర్కొంటూ, అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story