పాల్వంచలో క్రాకర్స్ వ్యాపారం మాటున అసలేం జరుగుతోంది?

by Jakkula.Mamatha |

పాల్వంచ పట్టణంలో క్రాకర్స్ వ్యాపారం పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాల్వంచలో క్రాకర్స్ వ్యాపారం మాటున అసలేం జరుగుతోంది?
X

దిశ,పాల్వంచ టౌన్: పాల్వంచ పట్టణంలో క్రాకర్స్ వ్యాపారం పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా క్రాకర్స్ విక్రయాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో తయారీ కూడా జరుగుతోందనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రాకర్స్ తయారీ కేంద్రాల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర పేలుడు ఘటనలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

భద్రతా నిబంధనలను విస్మరించడం ఎంతటి విషాదానికి దారి తీస్తుందో ఆ ఘటన స్పష్టం చేసింది. అలాంటి సంఘటనలు మళ్లీ ఎక్కడ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఇలాంటి సమయంలో పాల్వంచలో వినిపిస్తున్న ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్థానికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ నుంచి బాణాసంచా తయారీలో అనుభవం ఉన్న కొందరు వ్యక్తులు, తయారీకి అవసరమైన సామగ్రి ఇక్కడికి వస్తున్నాయనే ప్రచారం ఉంది. స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా తయారీ జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. అందుకే అధికారులు వాస్తవాలను వెలికి తీసి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.

మరోవైపు, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్నామని చెబుతున్న కొందరు లైసెన్స్‌దారులు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అక్రమంగా వ్యవహరించే కొందరి కారణంగా మొత్తం వ్యాపార వర్గానికే చెడ్డపేరు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. అందువల్ల అక్రమాలు ఉంటే వాటిని వెలికి తీసి కఠిన చర్యలు తీసుకోవాలని వారే అధికారులను కోరుతున్నట్లు సమాచారం.పట్టణంలో జనావాసాల సమీపంలో ఎక్కడైనా అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేయడం లేదా తయారీ జరపడం జరిగితే, అది ఎప్పుడైనా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యమే భారీ ప్రాణ నష్టానికి కారణమవుతుందని గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పాల్వంచ ఎస్సై నాగరాజు స్పందిస్తూ.. "క్రాకర్స్ విక్రయాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. తయారీకి ఎలాంటి అనుమతులు లేవు. మాకు సమాచారం అందితే పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, పేలుడు పదార్థాల నియంత్రణ విభాగం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. లైసెన్స్ షరతులు పాటిస్తున్నారా? నిల్వలు నిబంధనల ప్రకారమే ఉన్నాయా? ఎక్కడైనా అనుమతి లేకుండా తయారీ జరుగుతోందా? భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతుండడంతో, వాస్తవాలు ఏవైనా ఉంటే వాటిని అధికారికంగా బయటపెట్టి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాన్ని ముందే నివారించడమే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు అని ప్రజలు గుర్తు చేస్తున్నారు.

Next Story