ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి వివేక్​వెంకటస్వామి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగుల సంరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు.

ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి వివేక్​వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగుల సంరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, తగినంత మందుల నిల్వలు ఉండేలా చూడాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈఎస్‌ఐసి (ESIC) ద్వారా రాష్ట్ర ఈఎస్‌ఐకి రావాల్సిన నిధులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవాళ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సీటీ స్కాన్ సదుపాయం, ఆర్‌.సి. పురం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఐసీయూ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ రెండు పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిపి సుమారు 600 మంది నియామకాల కోసం గతంలోనే ప్రతిపాదనలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఆర్‌బీ (MHSRRB) కి పంపినట్లు తెలిపారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి నిరంతరం పర్యవేక్షించాలని, సిబ్బంది కొరత సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రుల పనితీరు, సిబ్బంది సంఖ్య, కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై ఆరా తీశారు. ఐపీ (IP) లకు సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ అవకాశం లేదన్నారు. నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి పరిపాలనాపరమైన అడ్డంకులు రాకుండా అన్ని అంశాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈఎస్‌ఐలో పని సంస్కృతిని మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆర్‌.కె పురంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనికి ఎస్సీసీఎల్ (SCCL) నుంచి భూమి పొందవచ్చని, ఆ దిశగా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నందున ఈ డిస్పెన్సరీల ఏర్పాటు ఎంతో కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మందుల కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత పాటించాలని, విధివిధానాలను ఖచ్చితంగా అనుసరించాలని స్పష్టం చేశారు.

Next Story