వెదర్ అప్డేట్స్ : పగలు దంచికొట్టే ఎండ.. సాయంత్రం పిడుగులు

by Muthe.Rajitha |

తెలుగు రాష్ట్రాల్లో నేడు తీవ్రమైన ఎండలు ఉండబోతున్నట్టు భారత వాతావరణశాఖ పేర్కొంది.

వెదర్ అప్డేట్స్ : పగలు దంచికొట్టే ఎండ.. సాయంత్రం పిడుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో నేడు తీవ్రమైన ఎండలు ఉండబోతున్నట్టు భారత వాతావరణశాఖ పేర్కొంది. అయితే కొన్ని చోట్ల సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలియజేసింది. అలాగే ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరించింది.

తెలంగాణకు 'ఆరెంజ్ అలర్ట్'

తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు 36°C నుంచి 38°C వరకు నమోదవుతున్నా, సాయంత్రం వేళల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. హైదరాబాద్ నగరంలో పాక్షికంగా మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఐఎమ్‌డి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఏపీలో మండే ఎండలు

ఏపీలో పరిస్థితి నిప్పుల కొలిమిని తలపించనుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C - 42°C మార్కును తాకనున్నాయి. తీవ్రమైన వడగాల్పుల (Severe Heatwave) వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గాలిలో తేమ పెరగడం వల్ల విపరీతమైన ఉక్కపోత (Sultry weather) ఉండనుండగా.. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వారాల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఏప్రిల్ రెండవ వారం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story