అద్భుత దేవాలయంగా హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతాం

by Ratna Kumari |

హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని రాష్ట్రంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

అద్భుత దేవాలయంగా హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతాం
X

దిశ, మంగపేట : హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని రాష్ట్రంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం హేమాచల క్షేత్రాన్ని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, భగవాన్‌రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య తదితర అధికారులతో కలిసి మంత్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రూ.3 కోట్ల వ్యయంతో ఆలయంలో ముఖ మండపం, మహాద్వారం (ఆర్చి), అన్నదాన సత్రంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి మంగపేటలోని పాత పుష్కర ఘాట్‌ను పునరుద్ధరించడంతో పాటు మండల కేంద్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంగపేట–భూర్గంపాడు రహదారి అభివృద్ధికి రూ.41.69 కోట్లు, మంగపేట–కోమటిపల్లి–కాటాపూర్ రహదారి అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే పోషమ్మ ఆలయం వద్ద రెండు షెడ్లు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు.

ములుగు జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, రామప్ప, లక్నవరం, బొగత జలపాతం, హేమాచల క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. హామ్ (HAM) ప్రోగ్రాం కింద రూ.50 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరాస్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, అయ్యూరి యానయ్య, బుచ్చిరెడ్డి, టెంపుల్ కమిటీ చైర్మన్ యారంగరి సురేష్, మైల జయరాం రెడ్డి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఆకుల రాధాకృష్ణ, పచ్చ శేషగిరిరావు, చింత పున్నారావు, సురేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story