70 -80 మున్సిపాలిటీల్లో సత్తా చాటనున్నాం: కాంగ్రెస్ పార్టీ

by Malleboina Mahesh |

రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగియగా తామే అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

70 -80 మున్సిపాలిటీల్లో సత్తా చాటనున్నాం: కాంగ్రెస్ పార్టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగియగా తామే అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పోలింగ్ జరిగిన 116 మున్సిపాలిటీలలో వార్డుల వారీగా, 7 కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా హస్తం నేతలు పోలింగ్ పర్సెంటేజ్‌ ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీతో, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్‌తో పోటీ ఉన్నా తమ పార్టీకే ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారని పేర్కొంటున్నారు.

పోలింగ్ సరళిని పరిశీలించాక 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయంటూ టీపీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్ గౌడ్ సైతం చెప్పారు. ప్రధానంగా నిజామాబాద్‌లో పార్టీ భారీ సంఖ్యలోనే సీట్లు గెల్చుకుంటున్నా, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్ 10 నుంచి 16 వరకూ డివిజన్లు గెలిచే అవకాశాలున్నట్లుగా అంచనా వేశాయి. అయితే బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తుందని, మేయర్ కూడా కైవసం చేసుకుంటుందని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం గమనార్హం.

హంగ్ చాన్స్ ఉన్నచోట సంప్రదింపులు షురూ..

కరీంనగర్‌లో కూడా కాంగ్రెస్ పెద్దసంఖ్యలో సీట్లు గెల్చుకున్నా ఎంఐఎం, స్వతంత్రుల సాయంతో మేయర్ సీటు కైవసం చేసుకుంటామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ కూడా బీజేపీకి చాన్స్ ఉందని, బీఆర్ఎస్ కూడా మూడో స్థానంలో ఉన్నట్లుగా పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో మేయర్ పీఠానికి ఏయే రాజకీయ సమీకరణాలు తోడవుతాయన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ 15 నుంచి 18 వరకు సీట్లు గెలుచుకుంటుందని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మిగతా కార్పొరేషన్లలో ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే మంచిర్యాలలో 42-45 డివిజన్లు, రామగుండంలో 33-45, నల్లగొండలో 29-33, కొత్తగూడెంలో 30-34, మహబుబ్‌నగర్‌లో 28-31 డివిజన్లు కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేల్లో వెల్లడవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఈ ఐదు కార్పొరేషన్లలో తామే అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీఠం పై పాగా వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లో 70 నుంచి 80 దాకా తాము గెలుచుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరో 10 నుంచి 15 చోట్ల హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నా అక్కడ కూడా తమకే విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలతో కాంగ్రెస్ సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గత పదేళ్ల అధికారంలో లేకున్నా కూడా ఇంత పెద్ద సంఖ్యలో తమకు పట్టణాల్లో ప్రజా మద్దతు లభించడం రానున్న రోజుల్లో పార్టీకి సంస్థాగతంగా అర్బన్ ప్రాంతాల్లో మంచి పునాది పడినట్లే అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story