జాడలేని వానలు.. తాగునీటికి తిప్పలు తప్పవా?

by Muthe.Rajitha |

నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా తెలంగాణ వ్యాప్తంగా ఆశించిన వర్షాలు కురవకపోవడం రాష్ట్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడికి దారితీస్తోంది.

జాడలేని వానలు.. తాగునీటికి తిప్పలు తప్పవా?
X

దిశ, వెబ్, డెస్క్ : నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా తెలంగాణ వ్యాప్తంగా ఆశించిన వర్షాలు కురవకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడికి దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన నదుల్లో ప్రవాహాలు లేక, ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించే అత్యంత ప్రతిష్టాత్మక 'మిషన్ భగీరథ' (Mission Bhagiratha) కు మూలాధారమైన 29 ప్రధాన రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో అడుగంటిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

జులై నెలాఖరే డెడ్‌లైన్ – అధికారుల హెచ్చరిక

రాష్ట్రంలోని తాజా నీటి నిల్వలపై ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు పక్క రాష్ట్రాల వైపు మళ్లడం, తెలంగాణలో కేవలం ముసురు వాతావరణం తప్ప గట్టి వానలు పడకపోవడంతో రిజర్వాయర్లలోకి ఇన్‌ఫ్లో (Inflow) పూర్తిగా నిలిచిపోయిందని వివరించారు. ఇదే పరిస్థితి గనుక కొనసాగి, జులై నెలాఖరులోగా ప్రాజెక్టుల్లోకి కొత్త నీరు రాకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

ప్రభుత్వం ముందస్తు యాక్షన్ ప్లాన్

అధికారుల నివేదికతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు తక్షణమే రంగంలోకి దిగింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక పటిష్టమైన ముందస్తు ప్రణాళికను (Contingency Plan) సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా (RWS) విభాగాలను ఆదేశించింది. మిషన్ భగీరథ నీరు అందని ప్రాంతాలలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన వ్యవసాయ, కమర్షియల్ బోర్బావులను (Borewells) గుర్తించాలి. తాగునీటి లభ్యత కోసం అవసరమైతే ఆయా బోర్బావులను ప్రభుత్వ పరంగా అద్దెకు తీసుకుని, పైప్‌లైన్ల ద్వారా స్థానిక ట్యాంకులకు అనుసంధానం చేయాలి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న సమస్యాత్మక గ్రామాలకు ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని చేరవేయాలి.

ఒకవైపు రైతాంగం వర్షాలు లేక సాగు పనులు మొదలుపెట్టలేక వేదన చెందుతుంటే, మరోవైపు తాగునీటి వనరులు కూడా హరించుకుపోతుండటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. రానున్న రోజుల్లోనైనా వాతావరణం అనుకూలించి భారీ వర్షాలు కురిస్తేనే రాష్ట్రం ఈ తాగునీటి గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.

Next Story