- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రులపై ఆరోపణలు.. సీఎం ఆకస్మిక తనిఖీలు
తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రతపై వస్తున్న వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రతపై వస్తున్న వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, అత్యంత సాదాసీదాగా చెన్నైలోని ఎగ్మూర్ లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ICH) లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి స్వయంగా వార్డుల్లోకి నడుచుకుంటూ రావడంతో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
రోగులతో స్వయంగా మాట్లాడిన సీఎం
ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలించిన సీఎం విజయ్.. అక్కడ అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై రోగులను, వారి కుటుంబ సభ్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరు ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇస్తున్నారా? ఎవరైనా లంచాలు అడుగుతున్నారా? అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడున్న చిన్నారి శిశువులను ఎత్తుకుని ముద్దాడిన సీఎం, బాలింతలతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను, అందుతున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు.
అధికారులపై తీవ్ర ఆగ్రహం
తనిఖీల సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో, వార్డుల పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తుండటం చూసి సీఎం విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పసిపిల్లలు ఉండే ఆసుపత్రిని ఇంత నిర్లక్ష్యంగా ఉంచుతారా అంటూ అక్కడున్న ఉన్నతాధికారులపై, శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాధ్యతని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యరంగంలో జవాబుదారీతనం పెంచేందుకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ముందస్తు నోటీసులు లేకుండా తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పష్టం చేశారు. సీఎం తాజా చర్యతో తమిళనాడులోని ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.






