Economy: భారత్ వృద్ధి అంచనాల్లో ఏడీబీ కోత

by S Gopi |

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం దేశీయ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని, అదే కారణంతో ఈ కోత విధించినట్లు ఏడీబీ తన తాజా ఏషియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ నివేదికలో తెలిపింది.

Economy: భారత్ వృద్ధి అంచనాల్లో ఏడీబీ కోత
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థపై ఇంధన ధరల భారం పెరుగుతున్న నేపథ్యంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే 2027-28 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధించగలదని అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం దేశీయ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని, అదే కారణంతో ఈ కోత విధించినట్లు ఏడీబీ తన తాజా ఏషియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ నివేదికలో తెలిపింది. ఈ అంచనాలు ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన 6.6 శాతం వృద్ధి అంచనాతో సరిపోగా, ఐఎంఎఫ్ కూడా ఇటీవల 6.5 శాతం నుంచి 6.4 శాతానికి వృద్ధి అంచనాలను తగ్గించిన వెంటనే ఏడీబీ నివేదిక రావడం గమనార్హం. అయినప్పటికీ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థల్లో భారత్ ముందంజలోనే ఉంటుందని ఏడీబీ విశ్వాసం వ్యక్తం చేసింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాలు, ఇంధన పన్నుల తగ్గింపు, ప్రభుత్వ మూలధన వ్యయం, బలమైన సేవల ఎగుమతులు వంటి అంశాలు వృద్ధికి బలమవుతాయని పేర్కొంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరలతో పాటు ఎరువులు, సరఫరా గొలుసుపై ఒత్తిడి పెరిగి ద్రవ్యోల్బణం అధికంగా ఉండే ప్రమాదం ఉందని, అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న రుణ వ్యయం, వాణిజ్య అనిశ్చితులు కూడా ఆసియా-పసిఫిక్ ప్రాంత ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లుగా మారవచ్చని ఏడీబీ హెచ్చరించింది.

Next Story