- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు: పదవులున్నా.. లేకున్నా నేతల్లో నైరాశ్యం!
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో కేడర్‌తో పాటు నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పదవుల్లో ఉన్నవారు, లేనివారు సైతం నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లూ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వ పథకాలకు పెద్దగా ప్రచారం రావడం లేదని, ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకు ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెబుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తమకు న్యాయం జరగలేదని, అనుకున్నది దక్కలేదని తీవ్ర నిరాశలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
పదవి వచ్చిన వారు.. రాని వారిలోనూ నిరాశ..
కాంగ్రెస్ప్రభుత్వంలో పదవి వచ్చిన వారు, పదవి రాని వారు ఒక్కోరకంగా అసంతృప్తితో ఉన్నారని పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ‘పదవి వచ్చిన వారు తమకు ఇందులో ఏముంది? మేము ఎంత కష్టపడ్డాం.. ఈ పదవా మాకు కట్టబెట్టేది’ అన్నట్టుగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మరికొందరు ‘మేము పార్టీలో ఎప్పటినుంచో ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వారికి పదవులు ఇచ్చారు. మాకూ ఇచ్చారు. వారికి మాకు తేడా ఏముంది? పదవి ఇచ్చారు కానీ అధికారం లేదు’ అంటూ ఇలా రకరకాలుగా తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు.
కాస్త ఎక్కువ, తక్కువ..
నాయకుల్లో అసంతృప్తి రగులుతుంటే ప్రభుత్వ పథకాలు, మంచి పనులను ప్రజల్లోకి ఎందుకు తీసుకుపోతారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కేడర్‌లో అసంతృప్తి తీవ్రంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక తమకు ఏమి రాలేదంటూ నిరాశతో మాట్లాడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కొట్లాడామని, అధికారం వచ్చాక తమకు ఏం దక్కిందని నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పదవులు వచ్చిన వారిలో కొంత, పదవులు రాని వారిలో చాలా ఎక్కువగా అసంతృప్తి ఉన్నట్టు తెలిసింది. అందుకే ప్రభుత్వం, పార్టీ మీద ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా వాటిని తాము ఎందుకు తిప్పికొట్టాలి.. పదవులు వచ్చిన వాళ్లు చూసుకుంటారులే అని కొందరు నేతలు మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ నేతలే ప్రభుత్వం, పార్టీ మీద అసంతృప్తితో ఉంటే ప్రతిపక్షాలకు బుద్ది చెప్పాలనే ఆలోచన ఎవరికి ఉంటుందని చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కేడర్, నేతల్లో నిరాశ నెలకొందని సమాచారం.
కష్టపడ్డవారికి పదవులు రాలే..
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తీవ్రంగా శ్రమించి అధికారంలోకి తీసుకొస్తే తమకే పదవులు ఇవ్వకపోతే ఇంకా తామేందుకు పార్టీ కోసం పనిచేయాలని చాలా మంది భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు గుర్తించని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని శాపనార్ధాలు పెట్టడం మొదలుపెట్టారని పార్టీలోని నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతవరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడిప్పుడే పీఏసీఎస్‌ల నామినేటెడ్పదవుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ కేడర్‌ను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీని ఒక లైన్‌లో నడపడటంలో అనేక మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారని పార్టీలోనూ చర్చ జరుగుతున్నది.
సీఎం చూసుకుంటాడులే...
కాంగ్రెస్‌లో అత్యధికులు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారే ఉన్నారు. వారంతా హైదరాబాద్‌లో ఉండటం తప్ప గ్రామాల్లో పర్యటించడంలేదని తెలిసింది. ప్రభుత్వం, పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రభుత్వ సమాచారం పార్టీలోని నేతలు, కిందిస్థాయి కేడర్‌కు అందకపోవడం లాంటివి సైతం ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడానికి ఓ కారణం అని టాక్. పార్టీ, ప్రభుత్వంలోని ముఖ్యఅంశాలు, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇలా అన్నింటినీ సీఎం రేవంత్‌రెడ్డి చూసుకుంటారులే అనే భావన పార్టీలోని చాలా మంది నాయకుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పదవులు రాగానే కొందరు నేతలు సైలెంట్ అయిపోయారు. ‘ఇంతకాలం కష్టపడ్డాం కదా? కొన్నిరోజుల వ్యక్తిగత జీవితం, ఆర్థికంగా కుదురుకోవడంపై దృష్టి పెట్టినట్టు’ టాక్. ఇక పదవి రాని వారు ఏమో పదవి వచ్చినట్టు మాట్లాడుకుంటారులే అని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మొత్తంగా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సిన వ్యవస్థ సరిగాలేదని, అసలు ఏం జరుగుతుంది? ఎలా జరగాలి? అనే విషయాలపై దృష్టి పెట్టే వారు లేరని టాక్ మొదలైంది.






