- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీ-ప్రైమరీ స్కూళ్లలో టెండర్లకు తూట్లు.. కోట్ల పనులు ఒక్క కంపెనీకే!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) పాఠశాలల నిర్వహణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి/ వనపర్తి క్రైమ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) పాఠశాలల నిర్వహణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పసిపిల్లల భవిష్యత్తుకు పునాది వేయాల్సిన చోట.. నిబంధనలను బేఖాతరు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపినట్లు తెలుస్తోంది. చిన్నారులకు అవసరమైన లేవీ సామగ్రి, బోధనా పరికరాల కొనుగోలులో టెండర్ల ప్రక్రియను తుంగలో తొక్కి, ఒకే ఒక్క ప్రైవేటు కంపెనీకి పనులను అప్పగించేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లక్షల నిధులు.. లక్ష్యాలు వేరేనా?
చిన్నారులు ఆటపాటలతో పాటు అక్షరాలను సులువుగా నేర్చుకునేలా.. ప్రతి ప్రీ-ప్రైమరీ పాఠశాలకూ ప్రభుత్వం రూ. లక్ష చొప్పున నిధులను మంజూరు చేసింది. ఇందులో అక్షరాలు, బొమ్మల చార్టుల కోసం రూ. 40 వేలు, శారీరక కండరాల బలోపేతానికి (నడక, పరుగు, దూకడం) సంబంధించిన క్రీడా సామగ్రికి రూ. 50 వేలు, ఇతర అవసరాలకు రూ. 10 వేలుగా బడ్జెట్‌ను నిర్దేశించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 85, నాగర్ కర్నూల్‌లో 74, వనపర్తిలో 48, జోగులాంబ గద్వాలలో 41 చొప్పున మొత్తం 248 పాఠశాలలు ఉన్నాయి. అంటే ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నిధులు దీనికోసం కేటాయించారు.
రూ. 5 లక్షలు దాటితే టెండర్ లేదా?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు లేదా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఎలాంటి కొనుగోళ్లయినా రూ. 5 లక్షల వ్యయం దాటితే ఖచ్చితంగా బహిరంగ టెండర్ల ద్వారానే అర్హులను ఎంపిక చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పద్ధతిని అవలంభించి టెండర్లు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేటలోనూ అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారు. కానీ, మిగిలిన నాలుగు జిల్లాల అధికారులకు ఈ రూల్స్ వర్తించవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కో జిల్లాలో రూ. 41 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు బడ్జెట్ ఉన్నప్పటికీ కనీసం ప్రకటన కూడా ఇవ్వకుండా రహస్యంగా ఒక ప్రైవేటు సంస్థకు పనులు కట్టబెట్టడం వెనుక మతలబు ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.
చేతులు మారుతున్న కోట్లు..
టెండర్లు పిలవకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకే కంపెనీకి లాభం చేకూర్చేలా అధికారులు వ్యవహరించడం వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణమే విచారణ జరపాలి
పసిపిల్లల చదువులతో ముడిపడి ఉన్న ఈ కొనుగోళ్ల వ్యవహారంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే చిన్నారుల భద్రతకే ప్రమాదమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ప్రైవేటు సంస్థకు అప్పగించిన కాంట్రాక్టును రద్దు చేయాలని, నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి పారదర్శకంగా అర్హులకు మాత్రమే పనులు అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






