ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా.. పీఎస్‌లో చీటింగ్ కేసులున్నా జాంతానై

by Kodari Anjali |

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లి సబ్‌రిజిస్టర్ కార్యాలయం నకిలీ దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు కేరాఫ్‌గా మారింది.

ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా.. పీఎస్‌లో చీటింగ్ కేసులున్నా జాంతానై
X

దిశ మేడ్చల్ బ్యూరో/ ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లి సబ్‌రిజిస్టర్ కార్యాలయం నకిలీ దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు కేరాఫ్‌గా మారింది. అక్రమ సంపాదన కోసం సబ్ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ) రియల్టర్లతో కుమ్మక్కై.. అప్పటికే అమ్మిన భూముల లింక్ డాక్యుమెంట్లతో నకిలీ డాక్యుమెంట్ల తయారీకి సహకరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కొర్రెములలోని నిషేధిత జాబితాలో భూమి రిజిస్ట్రేషన్లు చేసిన వైనంపై ‘దిశ’ వరుస కథనాలకు స్పందించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కిందటి నెల నారపల్లి ఎస్ఆర్‌ఓ శ్రీదేవిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు సదరు అవినీతి తిమింగలం అక్రమాల చిట్టా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తోంది. తాను సస్పెండ్ అయ్యే మూడు రోజుల ముందు ‘ఏకశిలా వెంచర్‌’లో గతంలో నకిలీ దస్తావేజులతో రిజిస్ట్రేషన్లకు పాల్పడి అరెస్టు అయిన కట్కూరి ప్రభాకర్ రెడ్డితో కుమ్మక్కై నకిలీ దస్తావేజుల (6380/2026) రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసు కేసులకే పరిమితం..

హైదారాబాద్ నల్లకుంటకు చెందిన బీ.సురేందర్ రెడ్డి మరో నలుగురు వ్యక్తులు కొర్రెముల గ్రామంలోని సర్వే నంబర్ 740 /పార్ట్, 741/పార్ట్, 742/పార్ట్‌లోని 6 ఎకరాల్లో ప్లాటుగా చేయబడిన భూమిని వేర్వేరు అమ్మకపు పత్రాల కింద కొనుగోలు చేశారు. అయితే, కట్కూరి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అదే సర్వే నంబర్లలో 6,292 చదరపు గజాల విస్తీర్ణాన్ని జీపీఏ రిజిస్టార్డ్ డాక్యుమెంట్ నెం. 19509 /2005 ద్వారా కొనుగోలు చేసి తన భూమిని ఎ.వీరయ్య, పి.సోమిరెడ్డిలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.6681/06, 6682/06 ద్వారా విక్రయించాడు. అల్రెడీ అమ్మిన భూమిలోని ప్లాట్లను ప్రభాకర్ రెడ్డి మళ్లీ అమ్మి రిజిస్టర్ చేయడంతో కొనుగోలుదారులు 2011లో ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. ఈ కేసులో బెయిల్ మీద విడుదలైన ప్రభాకర్ రెడ్డి మరలా జీపీఏ లింక్ డాక్యుమెంట్ నంబర్‌తో ఇప్పటివరకు దాదాపు 30కి పైగా నకిలీ దస్తావేజులు తయారు చేసి సురేందర్ రెడ్డి కొనుగోలు చేసిన భూమిలోని ప్లాట్ల ఏరియాను భౌతికంగా చూపించి సమస్యలు సృష్టించడంతో ఆయనపై పోలీసులు 2019లో మరో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మూడేండ్ల పాటు తప్పించుకుని తిరిగిన ప్రభాకర్ రెడ్డిని 2025 మే నెలలో అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా, నకిలీ దందాకు అలవాటు పడిన ప్రభాకర్ రెడ్డి మరో నకిలీ దస్తావేజు తయారీకి తెగపడ్డాడు.

కాసులిస్తే చాలు.. నకిలీ గికిలి జాంతానై..

నకిలీ దస్తావేజుల నిందితుడు ప్రభాకర్ రెడ్డి మరో అక్రమానికి పాల్పడేందుకు సస్పెన్షన్‌కు ముందే నారపల్లి ఎస్ఆర్ఓతో భారీ ఎత్తున డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. 2006లో కొర్రెముల సర్వే నంబర్ 740 /పార్ట్, 741/పార్ట్, 742/పార్ట్లోని 1452 గజాల ప్లాటును తాను అమ్మిన సోమిరెడ్డి నుంచి కొనుగోలు చేసినట్టు కిందటి నెలలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇదే సర్వే నెంబర్లలో జీపీఏ ఆధారంగా ప్రభాకర్ రెడ్డి వందల సంఖ్యలో ఇష్టాసారంగా 150 నుంచి 1900 వరకు నెంబర్లను వేసి ప్లాట్లు అమ్మగా, సోమిరెడ్డి కూడా దాదాపు 30 నుంచి 40 ప్లాట్లు అమ్మినట్టు ఈసీలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఏకశిల వెంచర్ బాధితుల విషయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తలదూర్చడం, ఈ కేసులో హైకోర్టు మొట్టికాయలు వేయడంతో తాను ఎవరి పక్షాన పోరాటం చేశానో తెలుసుకోలేక ఏకశిలా వైపు రాలేక మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఉత్తర్వులు పరిశీలించాక ఏకశిలా బాధితుల విషయంలో హైడ్రా అధికారులు సైతం చేతులెత్తేసినట్టు సమాచారం. ఇంత జరిగినా నకిలీ దస్తావేజుల దందాకు అలవాటు పడిన ప్రభాకర్ రెడ్డి నారపల్లి ఎస్ఆర్ఓ, నారపల్లికి చెందిన రియల్టర్లు (చెరుకు శివారెడ్డి, అతని బంధువు న్యాయవాది జుబేర్ అక్రం) సహకారంతో మరోమారు అక్రమ దందాకు తెరలేపాడు.

పట్టింపు లేని కోర్టు ఆదేశాలు..

కొర్రెముల రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 743 నుంచి 749 వరకు 1988లో చేసిన ఏకశిలా వెంచర్‌ను 2006లో అప్పటి జిల్లా పంచాయతీ అధికారి రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఆధారంగా వెంచర్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. జిల్లా పంచాయతీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కొంతకాలానికి ఏకశిలా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కొందరి సహకారంతో ప్రభాకర్ రెడ్డి నకిలీ దస్తావేజుల దందాకు వ్యూహరచన చేసి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో మరోసారి అమాయక ప్రజలను మోసగించేందుకు నారపల్లి ఎస్ఆర్‌ఓతో కుమ్మక్కై నకిలీ దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో నకిలీ దస్తావేజుల ఆధారంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభాకర్ రెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ల దందాకు అధికారులు చెక్ పెట్టకపోతే మరి కొంతమంది అమాయక ప్రజలు బలయ్యే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story