హరితహారానికి గొడ్డలి వేటు...!

by Kodari Anjali |

పర్యావరణ పరిరక్షణ కోసం గత ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలపై కొందరు స్వార్థపరులు గొడ్డలి వేటు వేస్తున్నారు.

హరితహారానికి గొడ్డలి వేటు...!
X

భీమిని మండలం టేకులపల్లి - రాంపూర్ రహదారిపై హరితహారం చెట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నరికివేస్తున్నారు. ఐదేళ్ల కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, ప్రయాణికులకు, రైతులకు నీడను ఇస్తుండగా ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారు. చెట్ల కింద మంటలు పెట్టి, అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి అక్రమంగా తరలిస్తున్నారు. మొక్కల సంరక్షణకు, కంచెల ఏర్పాటుకు ప్రభుత్వం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తుంటే.. ఈ చర్యలతో అదంతా వృథా అవుతోంది. గతంలో రాంపూర్ ఫ్లైఓవర్ వద్ద చెట్లను నరికిన వారికి అధికారులు జరిమానా విధించినా అక్రమార్కుల్లో మార్పు రాలేదు. గ్రామ పంచాయతీ అధికారులు ప్రతిరోజూ ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే క్షేత్రస్థాయిలో హరితహారం లక్ష్యం నీరుగారుతోందని ప్రజలు మండిపడుతున్నారు.

దిశ, మంచిర్యాల: పర్యావరణ పరిరక్షణ కోసం గత ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలపై కొందరు స్వార్థపరులు గొడ్డలి వేటు వేస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని టేకులపల్లి - రాంపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఐదేళ్లలో ఏపుగా పెరిగి ఎంతో ఆహ్లాదకరంగా మారాయి. బెల్లంపల్లి మీదుగా వెళ్లే ప్రయాణికులతోపాటు పొలాల వద్ద పనిచేసే రైతులు కూడా ఎండ తీవ్రతకు ఈ చెట్ల నీడన సేదతీరుతున్నారు. అయితే, గత నెల రోజులుగా కొందరు గిట్టని వ్యక్తులు ఈ చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరికివేస్తుండడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

మంట పెట్టి.. మాయం చేస్తున్న వైనం...

అక్రమార్కులు మొదట ఈ చెట్ల కింద మంట పెడుతున్నారు. దీంతో అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ముక్కలుగా నరికి అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో రాంపూర్ ఫ్లైఓవర్ పక్కన రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేసిన కొందరికి అధికారులు జరిమానా విధించి హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రతి ఏటా ప్రభుత్వం వనమహోత్సవాన్ని ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తూ, మొక్కల సంరక్షణకు రూ.లక్షల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీళ్లు పోసి మరీ కాపాడిన చెట్లను ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం నరికేస్తుంటే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నీరుగారుతోంది.

అధికారుల కళ్లుండీ చూడరు!

గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రతిరోజూ ఇదే రోడ్డు గుండా మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున వృక్షాల విధ్వంసం జరుగుతున్నా వారు చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకునే అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏపుగా పెరిగిన చెట్లు అక్రమార్కుల పాలవుతుండడాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

మండలంలోని ప్రతి గ్రామంలో హరితహారం మొక్కలను సంరక్షించడంలో గ్రామపంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కరువవడంతో మండలస్థాయి సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తూట్లు పొడుస్తూ, చెట్లను నాశనం చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Next Story