ఏయ్ బిడ్డా.. ఇది వైరస్ అడ్డా!

by Dishanational2 |
ఏయ్ బిడ్డా.. ఇది వైరస్ అడ్డా!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం 'వైరస్' పేరు వింటేనే యావత్ ప్రపంచం కలవరపడుతోంది. 'కరోనా' సృష్టించిన కల్లోలమే ఇందుకు కారణం కాగా.. వాటిని నాశనం చేస్తే గానీ మానవాళికి ప్రశాంతత లేదనే అభిప్రాయాలు బలపడ్డాయి. కానీ వైరస్‌‌‌లన్నీ చెడ్డవి కావు. నిజానికి ప్రమాదకర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడి మానవ శరీరాలను రక్షించే ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వాటిని పేర్కొనవచ్చు. జీవ కోటికి అనేక ప్రయోజనాలు కలిగించే వైరస్‌ల ఉనికి భూమిపై మానవ మనుగడకు 3.5 బిలియన్ సంవత్సరాల ముందే కలదు. సముద్రపు నీరు, మట్టిలోనే కాక వాతావరణంలోనూ భాగమైన వైరస్‌లు ఎకో సిస్టమ్ నిర్వహణలో కీలక విధులు నిర్వర్తించడంతో పాటు జాతుల పరిణామ క్రమంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ మేరకు భూ గ్రహంపై పురుడోసుకున్న తొలి ఏక కణం జీవి నుంచి విభిన్న జీవరాశుల పుట్టుక వరకు వైరస్‌లే కారణం. అలాంటి జీవులు కలిగేంచే నష్టాలేంటో అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. ఫర్ ఏ చేంజ్.. వాటివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

విశ్వంలోని ప్రతీ నక్షత్రానికి 100 మిలియన్లకు పైగా వైరస్‌లను అందించినా.. ఇంకా కోట్లాది వైరస్‌లు భూగ్రహంపై ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. భూమిపై మొత్తంగా 10 నానిలియన్ వైరస్‌లు ఉండగా.. మానవ జనాభా 8 బిలియన్లు మాత్రమే. అంటే కోటానుకోట్ల వైరస్‌ల మధ్య మనుషులు ఓ మైక్రోస్కోపిక్ స్థలాన్ని ఆక్రమించారన్నమాట. ఇక మానవులకు హాని చేయని వైరస్‌ల ఉనికే ఎక్కువ కాగా.. క్షీరదాలు, పక్షుల్లోని దాదాపు 1.7 మిలియన్ వైరల్ జాతుల్లో 219 మాత్రమే మానవులకు సోకుతున్నాయి. శిలీంధ్రాలు, మొక్కలు, కీటకాల్లోని వైరస్‌లు సైతం ఆయా జీవుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతున్నాయి. కాగా 'ఫేజెస్'గా పిలువబడే బాక్టీరియో ఫేజెస్.. సముద్రంలోని చెడు బ్యాక్టీరియా జనాభాను నియంత్రించడంలో మేజర్ రోల్ పోషిస్తాయి. అంతేకాదు మనం పీల్చే ఆక్సిజన్‌లో మూడో వంతును సముద్రంలోని 'సయానో' బ్యాక్టీరియా తయారుచేస్తుండగా, ఆ ఆక్సిజన్‌ ఉత్పత్తికి ఈ వైరస్‌లే ప్రేరణగా నిలుస్తాయి. ఇక మానవ శరీరంపై, అంతర్గతంగా 380 ట్రిలియన్ వైరస్‌లు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం మనతో సహజీవనం చేస్తుండగా కొన్ని వైరస్‌లు మాత్రమే హాని కలిగిస్తున్నాయి.

'ఫేజెస్' ఉపయోగం

బాక్టీరియో ఫేజ్‌లు ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. పంటలను రక్షణ, ఆహారం నిల్వ, జీవాయుధాలు లేదా బయోటెర్రరిజాన్ని ఎదుర్కొనేటువంటి కార్యకలాపాల్లో ఉపయోగించవచ్చు. ఆంత్రాక్స్ దాడులను ఎదుర్కోవడంలో ఫేజ్‌ల ఉపయోగంపై ప్రస్తుతం కెనడియన్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. యాంటీబయోటిక్స్‌ వచ్చాక ఫేజెస్‌ ఉపయోగం కాస్త తగ్గినా 2010 తర్వాత యాంటీబయోటిక్స్ విపరీతమైన వాడకంవల్ల మొండి బ్యాక్టీరియా పెరిగింది. దీంతో పరిశోధకులంతా మళ్లీ ఫేజెస్‌ వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం మొండి బ్యాక్టీరియాలను అంతం చేసేందుకు 'ఫేజెస్‌ థెరపీ' పేరుతో వైరస్‌లనే యుద్ధానికి దించుతున్నారు. అంతేకాదు ఫేజ్‌లు మన జీర్ణ, శ్వాసకోశ, పునరుత్పత్తి మార్గాల శ్లేష్మ పొరల్లో దాక్కొని చెడు బ్యాక్టీరియాపై దాడిచేస్తూ అనేక ఇన్‌ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తున్నాయి. ఇక ప్రాణాంతక బ్యాక్టీరియా వల్ల సంక్రమించే సెప్సిస్ వ్యాధి చికిత్సకు ఫేజ్‌లను వినియోగిస్తుండగా.. ముఖ్యంగా ఔషధ నిరోధక అంటువ్యాధుల చికిత్సలో ఇవి కీలకంగా మారాయి.

రక్షించే వైరస్‌లు..

ఫేజెస్ మాత్రమే కాక అనేక వైరస్‌లు మానవశరీరాన్ని కాపాడుతున్నాయి. స్త్రీలు గర్భం దాల్చినపుడు 'మాయ' ఏర్పడేందుకు కూడా ఓ వైరస్ డీఎన్‌ఏనే కారణం. 200,000 ఏళ్లకు పైగా మానవ DNAలో ఉన్న HERVK (హ్యూమన్ ఎండోజెనస్ రెట్రోవైరస్ K) అనే రెట్రో వైరస్.. ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి పిండాన్ని కాపాడుతుందని స్టాన్‌ఫోర్డ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు మానవులను బుద్ధిజీవులుగా మారేందుకు కూడా ఓ వైరస్ దోహదపడిందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా జాతుల పరిణామంలో సమగ్ర పాత్ర పోషించిన వైరస్‌లు.. వందల మిలియన్ సంవత్సరాలుగా మానవ జన్యువుల్లోకి చొరబడుతున్నాయి. ప్రస్తుతం హ్యూమన్ బాడీలో ఉండే సుమారు పాతికవేల జన్యువుల్లో 8 శాతం వైరస్‌ల వల్లే శరీరంలోకి ప్రవేశించాయి. ఇక క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటితో పోరాడేందుకు లేటెంట్ హెర్పెస్ వైరస్ ఉత్పత్తి చేసే యాంటిజెన్లు రోగనిరోధక వ్యవస్థకు సాయపడతాయి.

భవిష్యత్ ప్రణాళిక లేకపోతే..

పురోగతి పేరుతో అడవులను నరికివేత, ఖనిజాల వెలికితీత, వేట, జంతువుల వధ.. వైరస్ స్పిల్‌ఓవర్‌కు ముఖ్య కారణాలుగా ఉన్నాయి. లాన్సెట్ కౌంట్‌డౌన్ 2019 నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, గ్రీన్‌హౌస్ వాయు(GHG) ఉద్గారాలు వైరస్‌ల దాడికి కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులపై ఎటువంటి చర్య తీసుకోకపోతే 2080 నాటికి సుమారు ఒక బిలియన్ ప్రజలు దోమల వల్లే అనేక వ్యాధుల బారినపడతారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కరోనా ఓ ముందస్తు సూచన మాత్రమే. మానవుల అంటు వ్యాధుల్లో మూడింట రెండు వంతులు, అదేవిధంగా కొత్తగా ఉద్భవిస్తున్న వ్యాధుల్లో మూడొంతులు జంతువుల స్పిల్‌ఓవర్స్ వల్లే సంభవిస్తున్నాయి. క్షీరదాలు, పక్షుల్లో మానవాళికి ప్రసారం చేసే జునోటిక్ వైరస్‌లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల గ్రహం మీద అతిథులుగా మన స్థితిని గుర్తించి అందుకనుగుణంగా జీవిస్తే ఏ సమస్య ఉండదు. కాదని బాధ్యతారహితంగా వ్యవహరిస్తే మన వినాశాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్లు.


Next Story

Most Viewed