మహిళా ఎంపీపీల 'పదవి' గొడవ.. నాకంటే నాకంటూ సభలో రచ్చ రచ్చ

by Disha Web Desk 19 |
మహిళా ఎంపీపీల పదవి గొడవ.. నాకంటే నాకంటూ సభలో రచ్చ రచ్చ
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పంద ప్రకారం చెరొక రెండున్నర సంవత్సరాలు ఎంపీపీ పదవిలో కొనసాగాలని పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ చేసుకొని రాతపూర్వకంగా బాండ్ పేపర్‌పై రాసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ భూక్య విజయలక్ష్మి ఒప్పందం ప్రకారం తన పదవి నుంచి తప్పుకోకుండా కొనసాగుతున్నారు. సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ బాణోత్ అనిత సభను అడ్డుకున్నారు. ప్రస్తుత ఎంపీపీ విజయలక్ష్మి రాజీనామా చేసి ఎంపీపీ పదవిని తనకు ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు.

ఇద్దరు అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు సభ జరగకుండా వారి వ్యక్తిగత ఒప్పందాల ప్రకారం అడ్డుకోవడంపై ప్రతిపక్ష సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పదవి కోసం సభలో గొడవకు దిగడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. వైస్ ఎంపీపీ బాణోత్ అనిత పట్టు విడవకుండా ఆందోళన చేపట్టారు. ఎంపీపీ విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పి సభ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు.


Next Story

Most Viewed