- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వట్టే జానయ్య యాదవ్ వజ్ర రైస్ మిల్లుపై దాడులు రాజకీయ కుట్ర
టీఆర్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయిస్తోందని టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆరోపించారు.

దిశ, సూర్యాపేట : తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయిస్తోందని టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఆర్‌పీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అడిషనల్ కలెక్టర్‌కు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు.
గత మూడు రోజులుగా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న రూ.69 కోట్ల ధాన్యం స్కామ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. రూ.69 కోట్ల స్కామ్ జరిగిందని ప్రభుత్వం చెబుతుంటే, ఆ ధాన్యాన్ని ప్రజలకు చూపించలేకపోతోందని విమర్శించారు. వజ్ర రైస్ మిల్లులో వడ్లు, బియ్యం అక్రమంగా విక్రయించారంటూ నమోదు చేసిన కేసులు, జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ, కార్యకర్తలకు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించే వ్యక్తి వట్టే జానయ్య యాదవ్ అని, ఆయన పరారీలో ఉన్నారనే ప్రచారం కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు.
బీసీల ఐక్యతను చూసి ఓర్వలేకే దాడులు..
తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మధ్య ఉంటూ, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలను ఏకం చేయడంలో వట్టే జానయ్య యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారని మామిడి అంజయ్య పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరుస్తున్నారనే భయంతోనే అధికార పార్టీ ఈ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు అంతర్గతంగా కుట్ర పన్ని అధికార పార్టీకీ సహకరిస్తూ ఈ చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రజా క్షేత్రంలో ఉన్న కీలక నేతపై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోనే మంజుల గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.






