తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-23 02:59:59  IST  )

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాఘ శుద్ధ పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి సరస్వతీ దేవి క్షేత్రాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. సరస్వతి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామునే అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. ఏడు పాయల వద్ద పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు, అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

బాసరలో అక్షరార్చన..

నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సరస్వతీ దేవి జన్మదినం కావడంతో, వేలాది మంది భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

ఇంద్రకీలాద్రిపై సరస్వతీ అలంకారం

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

Next Story