ఎట్టకేలకు ట్రంప్ కొమ్ములు వంచిన భారత్... భారీగా టారిఫ్‌లు తగ్గింపు

by Muthe.Rajitha |   (  Updated:2026-02-03 02:46:22  IST  )

అమెరికా వాణిజ్య స్నేహమా? రాజకీయ పావులాటనా?

ఎట్టకేలకు ట్రంప్ కొమ్ములు వంచిన భారత్... భారీగా టారిఫ్‌లు తగ్గింపు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ప్రకటన చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు. అయితే అమెరికా చర్య భారత్‌కు అనుకూల నిర్ణయంగా కనిపించినప్పటికీ.. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా మంచితనం కోసం కాకుండా దానివెనుక అనేక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉంటాయనేది అక్షర సత్యం. ఇప్పుడు కూడా ఈ సుంకాల తగ్గింపు వెనుక ట్రంప్ రాజకీయ వ్యూహం, అమెరికా ఆర్థిక అవసరాలు, అలాగే భారత ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఉన్నాయి.

ముందుగా మనక ట్రంప్ రాజకీయ జీవితంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం "అమెరికా ఫస్ట్" అనే నినాదం చుట్టూనే తిరుగుతుంది. అది మిత్రదేశమా, శత్రుదేశమా అనే తేడా లేదు. లాభం ఉంటే స్నేహం, లేకపోతే ఏదోక రకమైన ఒత్తిడి. భారత్‌పై టారిఫ్ తగ్గింపు కూడా ఇదే కోవలోకి వస్తుందనేది గుర్తు పెట్టుకోవాలి.

ట్రంప్ ప్లాన్ ఇదేనా??

అమెరికా ప్రస్తుతం రెండు పెద్ద సమస్యలను ఎదుర్కొంటోంది. ఒకటి చైనా, రెండవది రష్యా. చైనా ప్రపంచ వాణిజ్యంలో అమెరికాకు పెద్ద పోటీగా మారింది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆధిపత్యాన్ని రష్యా సవాలు చేస్తోంది. ఈ రెండు దేశాలను ఒకేసారి ఎదుర్కోవడం అమెరికాకు కష్టం అవుతోంది. అందుకే ట్రంప్ ఈ రెండు దేశాలకు మద్దతునిచ్చే శక్తివంతమైన దేశాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేశాల్లో భారత్ కూడా ఒకటి.

భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అమెరికాకు మింగుడు పడని విషయం. కానీ భారత్ ఆ చమురుపై పూర్తిగా ఆధారపడకుండా ఇతర దేశాల వైపు కూడా చూస్తోంది. ఈ పరిస్థితిని ట్రంప్ ఒక అవకాశంగా మార్చుకున్నాడు. "మీరు కొంత సహకరిస్తే, మేము టారిఫ్‌లు తగ్గిస్తాం" అన్న సంకేతం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నేరుగా చెప్పకపోయినా, రాజకీయ భాషలో ఇది ఒక అర్థమయ్యే సందేశమే. అందుకే ఇటీవలి కాలంలో భారత్ రష్యా నుంచి కొంతమేర చమురు కొనుగోళ్లు తగ్గించడంతో అమెరికా టారిఫ్స్ ను కూడా కాస్త తగ్గించింది.

భారత్‌కు లాభమా.. నష్టమా..

మరి ఇది భారత్‌కు నిజంగా లాభమా అంటే? కొంతవరకు అవును అనే చెప్పుకోవచ్చు. భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్ కొంచెం విస్తృతం అవుతుంది. ఔషధాలు, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతికి ఈ తగ్గింపు ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో అమెరికా తన కంపెనీలకు భారత మార్కెట్‌లో తలుపులు తెరవాలని కోరుతోంది. ఇక్కడే భారత్ చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే అమెరికా వస్తువులు మనదేశాన్ని ముంచెత్తి భారత్ యొక్క "మేక్ ఇన్ ఇండియా"కు తూట్లు పడే అవకాశం ఉంది.

కాగా మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో సమతూకంతో వ్యవహరిస్తోంది. అమెరికాను సంతోషపెట్టాలని రష్యాను వదిలేయలేదు. అలాగే రష్యాపై పూర్తిగా ఆధారపడకుండా అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా సంబంధాలు కొనసాగిస్తోంది. ఇలా అన్ని దేశాలతో సామరస్యంగా వ్యవహరించడం అనేది శక్తియుక్తులు కలిగిన భారత విదేశాంగ విధానానికి చెందిన బలమైన చర్యగా నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఇక్కడితో అమెరికా మన మిత్ర దేశం అయిందని పూర్తిగా నమ్మలేం. భవిష్యత్తులో ట్రంప్ భారత్ పై మరోసారి ఒత్తిడి పెంచే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే ట్రంప్ రాజకీయ వ్యవహారం చాలా అనిశ్చితంగా ఉంటుంది. ఈరోజు టారిఫ్ తగ్గిస్తాడు, రేపు మరో డిమాండ్ పెడతాడు. అందుకే ఈ డీల్‌ను శాశ్వత పరిష్కారంగా చూడటం పొరపాటు. ఇది ఒక తాత్కాలిక ఉపశమనం లాగ మాత్రమే చూడాలి.

"ప్లాన్ B" రెడీ

అమెరికా వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని భారత్ "ప్లాన్ B" ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మళ్ళీ అమెరికాతో సంబంధాలు చెడితే ఏమి చేయాలి అనేదానికి రెడీగా ఉండాలి. అయితే ట్రంప్ తెంపరితనం తెలిసిన భారత్ అన్ని ప్లాన్స్ తో సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలోని యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చలు, మిడిల్ ఈస్ట్‌తో బలమైన సంబంధాలు, BRICS వేదికలో భాగస్వామ్యం.. ఇవన్నీ భారత్‌కు భారీ భరోసా కలిగించే అంశాలు. అంతేకాదు, 140 కోట్ల జనాభా ఉన్న దేశీయ మార్కెట్ కూడా భారత్‌కు పెద్ద బలం.

మోడీ ప్లాన్ అదుర్స్

ఈ మొత్తం పరిణామాలను చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్ తగ్గింపు భారత్‌ కు చేసిన ఉపకారం ఏమాత్రం కాదు. ఇది అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసం వేసిన ఒక అడుగు. కానీ భారత ప్రధాని మోడీ అమెరికా వ్యూహాన్ని తనకు లాభంగా మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ డీల్ విజయమా? వైఫల్యమా? అనే దానికంటే .. ఎవరికీ తలొగ్గకుండా, ఎవరికీ శత్రువుగా మారకుండా ముందుచూపుతో భారత్ తీసుకుంటున్న తెలివైన నిర్ణయంగా చెప్పాలి. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న వ్యూహమే ప్రపంచ శక్తిగా ఎదిగే లక్షణం.

ప్రపంచ శాంతికి ట్రంప్ లీడర్‌షిప్ కీలకం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Next Story