మళ్ళీ మొదలైన అమెరికా - ఇరాన్ యుద్ధం.. చమురు లైసెన్సులు రద్దు

by Muthe.Rajitha |

పశ్చిమాసియాలో అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరోసారి తీవ్రరూపం దాల్చింది.

మళ్ళీ మొదలైన అమెరికా - ఇరాన్ యుద్ధం.. చమురు లైసెన్సులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరోసారి తీవ్రరూపం దాల్చింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) మూడు అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఇరాన్ పరిధిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులను ప్రారంభించింది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్, క్విష్మ్ దీవి, బందర్ అబ్బాస్ వంటి ప్రాంతాలలో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

చమురు విక్రయాల లైసెన్స్ రద్దు

ఈ వైమానిక దాడులకు కొన్ని గంటల ముందే.. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించి అమెరికా ట్రెజరీ శాఖ ఇచ్చిన సాధారణ లైసెన్స్ (Waiver) ను అమెరికా తక్షణమే రద్దు చేసింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అమెరికా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తాము కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MOU) పూర్తిగా ఇరాన్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, అంతర్జాతీయ జలాల్లో అమాయక పౌరులు ఉన్న నౌకలను టార్గెట్ చేసినందుకు గానూ "తీవ్రమైన పరిణామాలు" ఉంటాయని హెచ్చరిస్తూనే ఈ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఒక అమెరికా అధికారి తెలిపారు.

తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఇరాన్

అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలను, వైమానిక దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్ర పదజాలంతో ఖండించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని (Ceasefire MOU) అమెరికా పూర్తిగా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్చలను విఫలం చేయాలని చూస్తోందని మండిపడింది. తమ జాతీయ ప్రయోజనాలకు, భద్రతకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని, అమెరికా చేసిన ఈ దాడుల వల్ల తలెత్తే తీవ్ర పర్యవసానాలకు వాషింగ్టన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ఈ తాజా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Brent Crude) ధరలు మరోసారి భారీగా పెరిగి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. తాజా పరిణామాలతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో మళ్లీ మొదలైంది.

Next Story